Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాలం చెల్లిన 'విరసం'

కాలం చెల్లిన 'విరసం'

విప్లవ రచయితల సంఘం (విరసం) ఇప్పటికి 56 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుంది. మొన్న ఆ సంఘం పుట్టినరోజు వేడుకల సభకు పోలీసులు అనుమతిని నిరాకరించడంతో మళ్ళీ అది వార్తల్లోకి ఎక్కింది.

అసలు విరసం రచయితలు తమ రచనలతో నిజంగా సమాజాన్ని అంత అల్లకల్లోలం చేస్తున్నారా? అన్నది ఒకసారి చూడాలి. విరసంపై ఎక్కుపెట్టాల్సిన ఒక సీరియస్ ప్రశ్న - వారి నుంచి గత రెండు దశాబ్దాలలో సమాజాన్ని సమూలంగా సమగ్రంగా పరిశీలించిన, లేదా విమర్శించిన లేదా సాంస్కృతిక యుద్ధం చేసిన నవల కాని, కవితా సంకలనం కాని, పత్రిక కాని ఒక్కటన్నా ఉందా? దీనికి సమాధానం- లేదు అనే.

అంతో ఇంతో ఈమధ్య కాలంలో సాయిబాబా రాసిన 'ఫైజ్ అహ్మద్ ఫైజ్' ప్రచురణలు కొంత సర్క్యులేషన్‌కు నోచుకున్నాయి. అది సాయిబాబా వ్యక్తిగత విశ్వాస ఘనత. ఇక ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు' లాంటి ధిక్కార రచన కూడా విరసం నుంచి ఒక్కటీ అగుపడదు. ఎక్కడో అరకొర అన్నట్టు అదీ దశాబ్దాల క్రితం 'అంటరాని వసంతం' లాంటిది కనిపిస్తుంది అంతే. సమూలంగా సమాజాన్ని మార్చే మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానం నమ్ముకున్న సంస్థలకన్నా, వ్యక్తులు అత్యంత ప్రభావపూరితమైన సాహిత్యాన్ని సమాజానికి అందించడం గమనించాల్సిన విషయం. 'పెంగ్విన్ లాంటి కేపిటలిస్ట్ ప్రచురణకర్తలు మా వెనుక లేరు,' అని విరసం చెప్పుకోవచ్చు. ముందు అలాంటి ప్రభావవంతమైన రచనలు ఉంటే కదా, తర్వాత ఎలా వ్యాపింప చేయాలి అన్నది ఆలోచించేది. నిజాయితీగా మాట్లాడుకుంటే - విరసం వెనుక 'మావోయిస్ట్' అనే పదం మాయమైతే - విరసం కనీస అస్తిత్వం కూడా కనుమరుగవుతుంది. కాలం చెల్లిన చిహ్నాలు విరసంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

విరసం ఆవిర్భవించిన తర్వాత, సమాజాన్ని సమూలంగా మార్చగలిగే భావనలు, ఉపాయాలు, కార్యక్రమాలను మరింత మెరుగుగా దళితవాదం తీసుకు వచ్చింది. ఈ దళిత వాదులు వ్యక్తిగతంగా కెరీరిస్టులైనా - ఆ సామాజిక వాదాన్ని బలంగా వినిపించడంలోను, సంప్రదాయక ఆలోచనా విధానాన్ని ప్రశ్నించడంలోను విజయవంతమయ్యారు.

బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి పునాది మతం కాదు కులం మాత్రమే అన్న చిన్న విషయాన్ని కూడా విరసం విస్మరించింది. మొన్నటి ఆ సంఘం పుట్టిన రోజు కరపత్రంలో ముప్పైసార్లకు పైగా ''ఈ దేశం బూర్జువా, భూ స్వామ్యం'' అంటూ అదే యాంత్రిక పదజాలం వాడింది కానీ, ''బ్రాహ్మణీయత'' అన్న ప్రస్తావన కేవలం మూడుసార్లు మాత్రమే వచ్చింది. అంటే విరసం కనీసం సమయానుగుణంగా వస్తున్న మార్పులను కూడా గమనించలేని స్థితిలో ఉంది.

అదానీ, అంబానీ, సంఘ్ పరివార్ లాంటి సంస్థల్లో ఉన్న విమర్శ, ఆత్మవిమర్శ విరసంలో లేదు. విమర్శించేవాడికి ఒక శ్రద్ధ ఉండాలి, ఆత్మవిమర్శ చేసుకునేవాడికి ఒక శ్రద్ధ ఉండాలి. ఎటుపక్క శ్రద్ధ లేకున్నా అన్ని వ్యవస్థలు 'ప్రతిధ్వని వాహకాలు' (Echo chambers) అవుతాయి. ఆత్మవిమర్శ అనేది ఆయా వ్యక్తుల స్వంత విచక్షణపై ఆధారపడిన విషయంగానే ఉండిపోయింది తప్ప వ్యవస్థీకృతం అయిన చిహ్నాలు విరసంలో లేవు. అందుకే ఇప్పటికీ కూడా నిర్భీతితో ఎంకౌంటర్లు చేసిన రాజకీయ నాయకులకు వెచ్చటి కరస్పర్శ ఇచ్చిన నాయకులను వేదికలపై ఎక్కిస్తుంది. దీనికి సమాధానంగా అతను 'ఆత్మవిమర్శ' చేసేసుకున్నాడనో, ఏదో పుష్కర స్నానం చేసినట్టు అగ్ని పరీక్షలో పునీతం అయి వచ్చాడనో సర్ది చెప్పుకుంటూ కాలం గడిపేస్తుంది. ఈ 'విమర్శ - ఆత్మ విమర్శ' అన్న అంశం, విరసంలో మాటగానే మిగిలిపోయింది కానీ, స్ఫూర్తిగా జాడలేదు. గత 56 సంవత్సరాలలో విరసం తన తప్పులపై విడుదల చేసిన అధికారిక ఆత్మవిమర్శ పత్రం ఏది?

చలం, గురజాడ ఆ కాలానికి గొప్పవాళ్లై ఉండవచ్చు కాని, ఈ కాలానికి పూర్తిగా అసందర్భం. ఐనా వీళ్ళ పేర్లు ఇప్పటికీ విరసం సభల్లో మారుమోగుతూ ఉంటాయి. దీని వల్ల రాడికల్‌గా ఎదుగుతున్న దళిత మేధావుల సమూహాన్ని ఆకర్షించడంలో విరసం పూర్తిగా విఫలం అయ్యింది. అసలు 1962లో అక్సాయ్ చిన్ గురించి 'సైనో - ఇండో' యుద్ధానికి దిగి భారతదేశాన్ని దురాక్రమణ చేసిన మావోను గుడ్డిగా ఫాలో అయ్యి అతని రచనలను తలకెక్కించుకుంది కాని, అతని దురాక్రమణపై మాత్రం కన్వీనియెంట్‌గా మౌనం వహించింది. ఇక్కడ ప్రశ్న - మావో తప్పిదం కాదు. మావో గొప్పవాడు కాదని కూడా కాదు. అంబేడ్కర్‌ విషయంలో అంత స్పష్టంగా విమర్శ స్థానాన్ని తీసుకున్న విరసం మావో విషయంలో మాత్రం దండకం చదువుతుంది? ఒక మేధావి సంస్థగా తాను పోషించాల్సిన భూమికను వదిలేసి యాంత్రిక వాహికగా పని చేస్తూ పోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారింది. డిజిటల్ పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది. డేటా క్యాపిటలిజం వచ్చింది. ప్లాట్‌ఫాం ఎకానమీ వచ్చింది. కానీ విరసం పదజాలం మాత్రం ''భూస్వామ్యం-బూర్జువా- సామ్రాజ్యవాదం'' అనే 1970ల భాషనే దాటలేకపోయింది

విరసం వార్తల్లోకి వచ్చేది సాహిత్య ఉత్పత్తి వల్ల కాదు; నిషేధం, అరెస్ట్, పర్మిషన్ నిరాకరణ జరిగినప్పుడే, అది కూడా ప్రభుత్వానికి మావోయిస్ట్ భయం ఉండడం వల్ల మాత్రమే. అంటే దాని ప్రస్తుత స్థితి జెనరేటివ్ కాదు, కేవలం రియాక్టివ్ మాత్రమే. విప్లవ కవిత/పాట రూపం 1970ల నుడికారం దగ్గరే ఆగింది. వస్తువు మాత్రమే కాదు, శిల్పం కూడా ఒక చోట గడ్డకట్టిపోయి ఉంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల శ్రమ విలువ ఎలా మారబోతోంది? ప్లాట్‌ఫామ్ లేబర్ కార్మిక వర్గాన్ని ఎలా పునర్నిర్మిస్తోంది? గిగ్ ఎకానమీ సంప్రదాయ కార్మిక రాజకీయాలను ఎలా సవాలు చేస్తోంది? ఇలాంటి సమకాలీన ప్రశ్నలపై విరసం నుంచి సమగ్ర సాహిత్య స్పందన కనిపించకపోవడం, దాని భావజాల స్తబ్ధతకు నిదర్శనం. ఇక విరసంకు ప్రత్యామ్నాయం ఒక్కటే - తమని తాము రద్దు చేసుకోవాలి, ఒక రెండు సంవత్సరాలైనా విరామం ప్రకటించాలి, క్రమంగా సంప్రదాయ విరుద్ధ ఆలోచనా సరళి ఉన్న వ్యక్తులను సమకూర్చుకోవాలి. అప్పుడు తర్వాతి కార్యక్రమం ఆలోచించుకోవాలి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy