Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగ్రెస్‌పై కుమార స్వామి ఘాటు విమర్శలు

కాంగ్రెస్‌పై కుమార స్వామి ఘాటు విమర్శలు

బెంగళూరు : కర్ణాటకలో ఉప ఎన్నికలు రసవత్తరంగా జరగబోతున్నాయనడానికి సంకేతాలు వెలువడుతున్నాయి. మిత్రపక్షాలుగా రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కనిపిస్తోంది. అధికార పక్షం బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది.

జేడీఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదని కాంగ్రెస్ బుధవారం స్పష్టం చేసిన నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్ర నేత కుమార స్వామి గురువారం ట్విటర్ వేదికగా కాంగ్రెస్‌ను తీవ్రంగా ఎండగట్టారు. కూటమి ఏర్పాటు చేసేందుకు తగిన పార్టీ కాంగ్రెస్ కాదని దుయ్యబట్టారు. కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాలంలో సంకీర్ణ ధర్మాన్ని కాంగ్రెస్ పాటించలేదని మండిపడ్డారు.

''కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు జేడీఎస్ నుంచి ఎవరు ప్రతిపాదించారు? 2018 శాసన సభ ఎన్నికల తర్వాత హెచ్‌డీ దేవె గౌడ (జేడీఎస్ అధినేత) గుమ్మం దగ్గరికి వాళ్ళు వచ్చినట్లుగా మాలో ఎవరం కాంగ్రెస్ గుమ్మం దగ్గరికి వెళ్ళలేదు'' అని కుమార స్వామి గురువారం ట్వీట్ చేశారు.

''సంకీర్ణ ధర్మాన్ని గౌరవించని కాంగ్రెస్‌తో పొత్తు సాధ్యం కాదు'' అని స్పష్టం చేశారు.

2018 శాసన సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కుమార స్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఇరు పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఫిరాయించడంతో ప్రభుత్వం గత ఏడాది కుప్పకూలింది.

కాంగ్రెస్ శాసన సభా పక్షం నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ బుధవారం మాట్లాడుతూ, నవంబరు 3న జరిగే ఉప ఎన్నికల కోసం జేడీఎస్‌తో అవగాహన కుదుర్చుకునే అవకాశం లేదని చెప్పారు.

జేడీఎస్ నేత, సీర ఎమ్మెల్యే సత్యనారాయణ గత నెలలో మరణించారు. కాంగ్రెస్ నేత, రాజరాజేశ్వరి నగర్ ఎమ్మెల్యే మునిరత్న పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు ఆయనపై అనర్హత వేటు పడింది.

దీంతో సీర, రాజరాజేశ్వరి నగర్ శాసన సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు అవసరమయ్యాయి. ఈ నియోజకవర్గాలకు నవంబరు 3న ఉప ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రకటించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy