మనలను అలరించడానికే కాబోలు
ఇంతగా అలలతో అలంకరించుకుని
ధవళ నాట్యం చేస్తూ వుంది ఈ సంద్రం
కలలతో పండిన కళ్ళతో పొద్దున్నే లేచి
సూర్యుడు దీని మీద మనసు పడి ధ్యాసతో
రాసే ప్రేమ లేఖలు ఈ ఎరుపు రేఖలు!
ఈ కదిలే అద్దంలో ఏ వేళలో మాత్రం
ఆ కదలని ఆకాశం తన ముఖాన్నెలా
కుదురుగా చూసుకోగలదో
పసిపిల్లాడు తల్లి దరికి పరుగుపరుగున
మాటిమాటికి ఇట్లా వచ్చి అట్లా వెళ్ళినట్లే
దీని అలలు ఈ ఒడ్డుకు వస్తూ పోతూ -
తానే నురగల పాఠశాలై
ఇది చూపరులకు తెల్లని నగవుల కళల్ని
చూపుతూ నిగర్విలా నేర్పుతున్నది
ముందుకు వడితో వెళ్లడమే కాదు
వెనక్కి మంద్రంగా మళ్లడమూ తెలిసిన
నిరంతర నిరాడంబర సంచార జీవి ఇది
ఇదెంత బహు మృదువు కాకపోతే
దీని స్పర్శాశీస్సులకే తీరంలో
ఈ ఇసుకింత మెత్త మెత్తనవుతున్నది !
పాతకళ్లను ఇక్కడ అలవోకగా వదిలేసి
ఇదిచ్చే సొగసుల కొత్త కళ్ళ తళతళలతో
యాత్రికులు ఇళ్లకెళుతున్నారు
రాత్రి వెన్నెలను కడుపారా
సోయి మరచి తాగినందుకా దీని తడిలో
ఇంత చల్లని హాయి ఇమిడిపోయింది!
దీనిలో మునిగి లేస్తున్నాం మైమరచి!
ఎన్నో కొన్ని అలల తీగల స్వచ్ఛ పరిమళం
మాలోకి ఇంకక పోతుందా దయతో అదృశ్యంగా!

