Friday, 30 Oct, 1.34 am ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
కమలం.. వ్యూహాత్మక ప్రచారం!

దుబ్బాకలో మోహరించిన బీజేపీ శ్రేణులు..

సంజయ్‌ ప్రచారం షురూ... నేడు కిషన్‌రెడ్డి రాక

గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నేతలు

వచ్చే ఎన్నికల నాటికి టీఆర్‌ఎ్‌సకు ప్రత్యమ్నాయంగా ఎదిగేందుకు అడుగులు

జీహెంచ్‌ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలపైనా నజర్‌

హైదరాబాద్‌, అక్ట్టోబరు 29(ఆంధ్రజ్యోతి): దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపొంది సత్తా చాటేందుకు కమలదళం తీవ్రంగా శ్రమిస్తోంది. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, దుబ్బాక గడ్డపై కాషాయజెండా ఎగురవేసేందుకు తహతహలాడుతోంది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కమలదళ ప్రచారం ఊపందుకుంది. పోలింగ్‌ సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ అభ్యర్థి రఘునందన్‌కు మద్దతుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గురువారం ప్రచార పర్వంలోకి దిగారు. ఇప్పటికే పలు సభల్లో పాల్గొన్న ఆయన ఆది, సోమవారాల్లోనూ మళ్లీ ప్రచారం చేయనున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం పలు ప్రచారసభలకు హాజరయ్యేలా పార్టీ షెడ్యూలు రూపొందించింది.

పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మలివిడత ఎన్నికల ప్రచారానికి రానున్నారని పార్టీవర్గాలు తెలిపాయి. ఫైర్‌బ్రాండ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా మరోసారి ప్రచారం చేసే అవకాశం ఉంది. డీకే అరుణతో పాటు రాజాసింగ్‌ ఇప్పటికే తొలి విడత ప్రచారసభలకు హాజరయ్యారు. బీహార్‌ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ కూడా దుబ్బాకలో పర్యటించే అవకాశం ఉంది. ''గతంలో ఏ ఉప ఎన్నిక జరిగినా తొలుత అట్టహాసంగా ప్రచారం చేసినా చివరికొచ్చేసరికి కొంత వెనుకబడ్డాం. అందుకే ఈసారి వ్యూహం మార్చి, ప్రచారంలో సీనియర్ల భాగస్వామ్యాన్ని క్రమంగా పెంచుతూ వచ్చి క్లైమాక్స్‌లో ఉధృతం చేయనున్నాం'' అని పార్టీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు.

పార్టీ ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, సోయం బాపూరావు కూడా రెండురోజుల కిందట నియోజకవర్గంలో ప్రచారం చేశారు. దుబ్బాక ఎన్నిక ప్రచారపర్వం 1న సాయంత్రం 5 గంటలకు ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో, ఈ మూడు రోజులు కూడా అత్యంత కీలకంగా పార్టీ నాయకత్వం భావిస్తోంది. కేసీఆర్‌ వ్యూహాలు బాగా తెలిసిన జితేందర్‌రెడ్డికి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించడంతోపాటు మారుతున్న సమీకరణాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, పట్టు నిలుపుకొనే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. మరోవైపు.. దుబ్బాకలోని కార్యకర్తలతో సంజయ్‌ నిత్యం మాట్లాడుతూ ప్రచారసరళిని తెలుసుకుంటున్నారు.

భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం

దుబ్బాక ఉప ఎన్నిక మాత్రమే కాదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదిగేందుకు బీజేపీ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. అధికార టీఆర్‌ఎ్‌సకు తామే ప్రత్యమ్నాయమని ప్రజల్లో విశ్వాసం కల్పించడంతోపాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రె్‌సను వెనక్కి నెట్టే దిశగా కమలనాథులు ముందుకు సాగుతున్నారు. కాంగ్రె్‌సలో సీనియర్లను ఆకర్షించడం, కొత్త-పాత కలయికతో ముందుకువెళ్లడం, ప్రతీ అంశంపైనా స్పందించడం, వీటికి తోడు మజ్లి్‌స-టీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్న వాదనను మరింత విస్తృతం చేసి తద్వారా హిందూత్వ భావజాలాన్ని వ్యాప్తి చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టి తద్వారా బలీయమైన శక్తిగా ఎదగాలని బీజేపీ అగ్ర నాయకత్వం సంకల్పించింది.

అందులో భాగంగానే స్ట్రీట్‌ ఫైట్‌(ప్రజా సమస్యలపై వీధిపోరాటాలు)..స్ట్రెయిట్‌ఫైట్‌(టీఆర్‌ఎస్‌ వైఫల్యాలు, అవినీతిపై ప్రజాక్షేత్రంలో, న్యాయపరంగా పోరాటాలు)..తో ముందుకెళ్లాలని రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది. అలాగే, కాంగ్రె్‌సకు అటు జాతీయ స్థాయిలో, ఇటు రాష్ట్రస్థాయిలో సరైన నాయకత్వం లేకపోవడం, గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎ్‌సలోకి ఫిరాయించడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. కాంగ్రె్‌సకు ఓటేస్తే టీఆర్‌ఎ్‌సకు వేసినట్లేనని.. విస్తృతంగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని భావిస్తోంది.

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతోందన్న వాదనను విస్తృతం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్న వాటిలో కేంద్రం వాటాను ప్రజానీకానికి తెలియజేయడం ద్వారా ఆయా సామాజికవర్గాలకు మరింత చేరువయ్యేదుకు ప్రయత్నిస్తోంది.

సంజయ్‌ సారథ్యానికి పరీక్ష

దుబ్బాక ఉప ఎన్నిక.. జీహెచ్‌ఎంసీ.. ఆపై పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పరంపరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తొలి పరీక్ష ఎదుర్కోబోతున్నారు. ఆరు నెలల కిందట రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన ఆయన జాతీయ నాయకత్వం నమ్మకానికి తగినట్లు ఫలితాలు రాబట్టాల్సిన సమయం వచ్చింది. దాంతో పటిష్ఠ అంతర్గత కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.

దుబ్బాకలో పోలింగ్‌ బూత్‌ వారీగా ఓటరుకు చేరువయ్యేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్లలో సంజయ్‌ పాదయాత్రకు రూట్‌ మ్యాప్‌ సిద్ధమవుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుని పోరాటం చేయాలన్న సంజయ్‌ ఆదేశాలకు అనుగుణంగా స్థానిక నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top