Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కమలంలో కుదరని సయోధ్య

కమలంలో కుదరని సయోధ్య

- గ్రూపు రాజకీయాలతో క్యాడర్‌ సతమతం

- అసంతృప్తిలో సీనియర్‌ నేతలు

- జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్‌లలో జోరుగా రాజకీయం

- అధిష్ఠానం దృష్టి సారించాలంటున్న కార్యకర్తలు

జగిత్యాల, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కమల దళంలో సయోధ్య కుదరడం లేదు. గ్రూపు రాజకీయాలతో క్యాడర్‌ సతమతమవుతోంది. పలువురు సీనియర్‌ నేతలు అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర స్థాయి కీలక నేతలు తెర వెనుక మంత్రాంగం చేస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వైఖరిని తప్పు పడుతున్న పలువురు నేతలు ఏకతాటిపైకి వచ్చి అసంతృప్తి వాదనలు వినిపిస్తున్నారన్న చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లలో బీజేపీ రాజకీయం జోరుగా జరుగుతోంది. జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంతకాలంగా చోటుచేసుకున్న అంతర్గత విభేదాలు తొలగకపోవడం, సయోధ్య కుదరకపోవడం పార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి.

ఫకోరుట్ల సెగ్మెంట్‌లో..

జిల్లాలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌కి 72,115 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు 61,810 ఓట్లు వచ్చి రెండో స్థానంలో నిలిచారు. తర్వాత 2024లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి 92,656 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 59,794 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ భారీగా పుంజుకుంది. అయితే ప్రస్తుతం కోరుట్ల సెగ్మెంట్‌లో బీజేపీ నాయకత్వ లోపం చోటుచేసుకుంది. ఎంపీగా విజయం సాధించిన ధర్మపురి అర్వింద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ రాజకీయాలపై దృష్టి సారించడం, కోరుట్లలో సరియైున నాయకత్వం లేకపోవడం పార్టీ శ్రేణులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. దీనికి తోడు మున్సిపల్‌ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న గ్రూపు రాజకీయాలు కార్యకర్తలను మరింత సతమతానికి గురిచేస్తున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబుపై దాడి సంఘటన సైతం చోటుచేసుకుంది. సెగ్మెంట్‌లోని ప్రధాన పట్టణాలయిన మెట్‌పల్లి, కోరుట్లలో పార్టీ కార్యక్రమాలు సైతం విజయవంతంగా పూర్తి చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పలు సందర్భాల్లో నాయకత్వంపై అసంతృప్తి, దాడులు, సస్పెన్షన్లు, కొత్త సమీకరణలతో మరింత గ్రూపు రాజకీయాలు పెరిగాయి.

ఫజగిత్యాల నియోజకవర్గంలో..

బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన సంజయ్‌ కుమార్‌కు 70,243 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డికి 54,421 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణికి 42,138 ఓట్లు వచ్చాయి. 2024లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ పరిధిలో జీవన్‌రెడ్డికి 76,145 ఓట్లు రాగా ధర్మపురి అర్వింద్‌కు 74,298 ఓట్లు వచ్చాయి. జగిత్యాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానంలో నిలిచినప్పటికీ గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి గణనీయంగా ఓట్లు పెరిగాయి. జగిత్యాల నియోజకవర్గంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఇచ్చిన బీజేపీ ప్రస్తుతం గ్రూపు రాజకీయాలతో సతమతమవుతోంది. మున్సిపల్‌ ఎన్నికల సందర్బంగా బీఫామ్‌ల కేటాయింపు మొదలుకొని అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు బీజేపీలో చిచ్చు రేపుతున్నాయి. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోగ శ్రావణి ప్రవీణ్‌ ఇంటిపై దాడి సైతం జరిగింది. ఈ వ్యవహారాన్ని ఎంపీ అర్వింద్‌ తీవ్రంగా తప్పు పట్టారు. కాగా ఇటీవల కొందరు సీనియర్‌ నేతలు ఏకతాటిపైకి వచ్చి ప్రత్యేక గ్రూపుగా ఏర్పడ్డారు. బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలు శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాయి.

ఫధర్మపురి నియోజకవర్గంలో..

ధర్మపురి నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 91,393 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌కు 69,394 ఓట్లు, బీజేపీకి 7,345 ఓట్లు వచ్చాయి. అయితే ప్రస్తుతం ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో నాయకత్వ లేమి చోటుచేసుకుంది. ఒకరిద్దరు నేతలు మొక్కుబడిగా పనిచేస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గంలో కొనసాగుతున్న ఒకరిద్దరు నేతలు కొద్దో గొప్పో పట్టించుకున్నప్పటికీ పార్టీ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగడం లేదన్న అభిప్రాయాలున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంపై దృష్టి సారించి పలువురు నేతలు ముందస్తుగా పావులు కదుపుతున్నారు. జిల్లాలో బీజేపీలో చోటుచేసుకున్న అంతర్గత విభేదాలను రూపుమాపి, నాయకులు, కార్యకర్తలను ఒక్కతాటిపైకి తీసుకొని రావడంపై అధిష్ఠానం దృష్టి సారించాలని పార్టీ అభిమానులు ఆశిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy