Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కరాచీలో 'ధురంధర్' సీన్ రిపీట్.. ఉజైర్‌ బలోచ్‌ సోదరుడిపై కాల్పులు

కరాచీలో 'ధురంధర్' సీన్ రిపీట్.. ఉజైర్‌ బలోచ్‌ సోదరుడిపై కాల్పులు

రాచీ: పాకిస్థాన్‌లోని కరాచీలో గ్యాంగ్‌స్టర్‌, నిషేధిత పీపుల్స్‌ అమన్‌ కమిటీ మాజీ చీఫ్‌ ఉజైర్‌ బలోచ్‌ సోదరుడు జుబైర్‌ బలోచ్‌పై కాల్పులు జరిగాయి.

గురువారం సాయంత్రం జుబైర్ తన ఇంటి బయట ఉన్న సమయంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు అతడిపై కాల్పులకు తెగబడినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనలో జుబైర్‌ ఛాతి, పొత్తికడుపులో బుల్లెట్లు దిగాయి. తీవ్రంగా గాయపడిన అతడిని కరాచీలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనలో మరో ఇద్దరు పాదచారులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్ పోలీసుల కథనం ప్రకారం.. ముఖాలకు ముసుగులు ధరించి వచ్చిన దుండగులు జుబైర్‌పై కాల్పులు జరిపారు. అయితే ఓ దుకాణదారుడు వారిపై ఎదురు కాల్పులు జరపడంతో నిందితులు పరారయ్యారు. ఘటన సమయంలో జుబైర్‌ తన ఇంటి బయట ఉన్నట్లు సీనియర్‌ పోలీసు అధికారి సయ్యద్‌ అసద్‌ రజా వెల్లడించారు.

గ్యాంగ్‌ వార్, వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే దాడి..

గ్యాంగ్ వార్, క్రిమినల్ యాక్టివిటీ నేపథ్యంలో జుబైర్‌ బలోచ్‌ 2012లో అరెస్టయ్యాడు. గత ఏడాది జనవరిలో జైలు నుంచి విడుదలయ్యాడు. పాత కక్షలు, గ్యాంగ్ వార్ నేపథ్యంలోనే జుబైర్‌పై కాల్పులు జరిగి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.

లియారీలో మళ్లీ గ్యాంగ్‌వార్‌.. భయాందోళనలో స్థానికులు..

జుబైర్‌ బలోచ్‌ కొన్ని నెలల క్రితం ఓ రాజకీయ పార్టీలో చేరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ జెండాలను జుబైర్ తన ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో 'కరాచీ ఆపరేషన్‌' తర్వాత దుబాయ్‌, ఇరాన్‌కు పారిపోయిన కొందరు గ్యాంగ్‌స్టర్లు అమెరికా-ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో తిరిగి కరాచీకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో లియారీ ప్రాంతంలో మళ్లీ గ్యాంగ్‌ వార్‌ చెలరేగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జైల్లో ఉజైర్‌ బలోచ్‌..

ఇదిలా ఉండగా.. గ్యాంగ్‌స్టర్ ఉజైర్‌ బలోచ్‌పై పాకిస్థాన్‌లో చాలా కేసులు ఉన్నాయి. హత్యలు, పోలీసులపై కాల్పులు, పేలుడు పదార్థాల తయారీ, సరఫరా తదితర కేసుల్లో అతడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2012లో కలకోట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలతో భద్రతా సిబ్బందిపై దాడి చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసుల్లో ఉజైర్ బలోచ్‌ను పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గూఢచర్యం కేసులో 2020 ఏప్రిల్‌లో కోర్టు అతడిని దోషిగా తేల్చి 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, తనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ ఉజైర్.. పాకిస్థాన్‌ యాంటీ టెర్రరిజం కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్లను 2026 మార్చిలో కోర్టు తిరస్కరించింది. దీంతో ఉజైర్ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు.

'ధురంధర్‌' సినిమాలో ఉజైర్‌ బలోచ్‌ పాత్ర..

ఉజైర్ బలోచ్.. ఏడాది ముందు వరకు ఈ పేరు మన దేశ ప్రజలకు పెద్దగా తెలియదు. కానీ, ధురంధర్ సినిమా తరువాత ఉజైర్ బలోచ్ ఎవరనేది అందరికీ తెలిసిపోయింది. 2026లో విడుదలైన భారత స్పై థ్రిల్లర్‌ మూవీ 'ధురంధర్‌'లో ఉజైర్‌ బలోచ్‌ పాత్రను నటుడు డానిష్‌ పాండోర్‌ పోషించారు. రెహమాన్ డకైత్ క్యారెక్టర్ తరువాత ఉజైర్ బలోచ్ క్యారెక్టర్ ధురంధర్ సినిమాలో హైలెట్ అయిన విషయం తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy