బెంగళూరు : అత్యాచార బాధితురాలిపై అవమానకర వ్యాఖ్యలను కర్ణాటక హైకోర్టు తొలగించినట్లు రాష్ట్ర న్యాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. నిందితునికి ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పులో బాధితురాలిపై హైకోర్టు జస్టిస్ కృష్ణ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదట జస్టిస్ కృష్ణ దీక్షిత్ సానుకూలంగా స్పందించారు.
కర్ణాటక లీగల్ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు మాట్లాడుతూ, అత్యాచారం కేసులో నిందితునికి జూన్ 22న ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పులో బాధితురాలిపై జస్టిస్ కృష్ణ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు.
ఈ వివాదాస్పద వ్యాఖ్యలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని చెప్పారు. దీంతో ఆ వ్యాఖ్యలను జస్టిస్ కృష్ణ దీక్షిత్ తన తీర్పు నుంచి తొలగించారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన దరఖాస్తులో కోరినట్లుగా, జూన్ 22న ఇచ్చిన తీర్పులోని నాలుగో పేజీలో, 3(సీ) పేరాలోని చివరి నాలుగు లైన్లను తొలగించడం సరైనదని భావిస్తున్నట్లు జస్టిస్ కృష్ణ దీక్షిత్ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు దర్యాప్తును, విచారణను ప్రభావితం చేయరాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను తొలగించేందుకు నిందితుడు అభ్యంతరం చెప్పలేదు.
ఓ ప్రైవేటు సంస్థ యజమానురాలు ఈ కేసులో బాధితురాలు. ఆ సంస్థలో పని చేసే ఉద్యోగి నిందితుడు.

