తెలంగాణ తాజావార్తలు
కరోనా రిట్లలో సర్కారుకు భారీ ఊరట!

మెజారిటీ వ్యాజ్యాల విచారణ క్లోజ్..
3 పిటిషన్లపైనే విచారణ కొనసాగింపు
రాష్ట్రంలో బాగా తగ్గిన కోవిడ్ కేసులు
జనవరి 21 నుంచి ఫిబ్రవరి 1 వరకు
రోజువారీ టెస్టుల లెక్కలు చెప్పాలి
కొత్త స్ట్రెయిన్‌పై వచ్చే 19లోగా నివేదిక
ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, జనవరి 21(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ కట్టడి, లాక్‌డౌన్‌లో ప్రజలు ఎదుర్కొన్న అవస్థలపై దాఖలైన 24 ప్రజాహిత వ్యాజ్యాలు, ఒక కోర్టు ధిక్కార కేసులో ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. కరోనా వైరస్ ప్రభావం దాదాపు తగ్గుముఖం పట్టడంతోపాటు, వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యిందని, ఇదివరకటి పరిస్థితులు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఒకే తరహాలో ఉన్న పలు వ్యాజ్యాలను మూసివేస్తున్నట్లు తేల్చిచెప్పింది. కరోనాపై విచారణలో ఉన్న బ్యాచ్ పిటిషన్లలో మూడు మినహా మిగిలిన వాటిని మూసివేసింది. అయితే రోజుకు ఎన్ని కరోనా టెస్టులు చేస్తున్నారో కోర్టు పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సీజే హిమా కోహ్లీ, జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 25కి వాయిదా వేసింది.
న్యాయవాదిపై అసహనం!
రోజుకు 50 వేల చొప్పున కరోనా పరీక్షలు చేయాలని, వారంలో ఒక రోజు లక్ష టెస్టులు చేయాలని ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం లేదంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మధ్యలో జోక్యం చేసుకుని అంతరాయం కలిగించిన న్యాయవాది తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. తాము ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నామని, ప్రజాహిత వ్యాజ్యాలు వ్యతిరేక వ్యాజ్యాలుగా ఉండరాదని ధర్మాసనం హితవు పలికింది. కరోనాపై దాఖలైన వ్యాజ్యాల్లో ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ధర్మాసనం గుర్తుచేసింది. రోజుకు ఎన్ని టెస్టులు చేస్తున్నారని ఏజీనుద్దేశించి ధర్మాసనం ప్రశ్నించగా, కోర్టు ఆదేశాల ప్రకారం రోజుకు 50వేలకు పైగా చేస్తున్నామని ఆయన బదులిచ్చారు.
ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం... చిన్న రాష్ట్రమైన ఢిల్లీలోనే రోజుకు 40వేలకు పైగా చేస్తున్నారని గుర్తు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ఇంకా ఎక్కువ టెస్టులు చేయాలని అభిప్రాయపడింది. ''జనవరి 21 నుంచి ఫిబ్రవరి 1 వరకు రోజుకు ఎన్ని టెస్టులు చేయనున్నారో జిల్లాల వారీగా పట్టిక రూపంలో ఇవ్వాలి'' అని స్పష్టం చేసింది. ''ఇప్పటిదాకా ఎన్ని ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు. ఎన్ని పాజిటివ్ వచ్చాయి. నిరుడు జూన్ నుంచి 'సీరో సర్వేలెన్స్' ప్రక్రియ ఎన్నిసార్లు చేపట్టారు. ఫలితాలు ఏంటి? ఆర్టీపీసీఆర్ టెస్టుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ తదితర వివరాలతో నివేదిక ఇవ్వాలి'' అని ధర్మాసనం ఆదేశించింది.
బ్రిటన్‌లో ప్రబలిన స్ట్రెయిన్ ప్రభావం రాష్ట్రంలో ఏమేరకు ఉందో చెప్పాలని ఏజీకి సూచించింది. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులందర్నీ గుర్తించి టెస్టులు చేశామని, నాలుగు కేసుల్లో మాత్రమే పాజిటివ్ వచ్చిందని ఏజీ కోర్టుకు చెప్పారు. వారిని ఐసోలేట్ చేసి చికిత్స అందించామని, కాంటాక్టులను గుర్తించి పరీక్షలు చేసినట్లు తెలిపారు. బ్రిటన్ స్ట్రెయిన్‌పై ఫిబ్రవరి 19లోగా నివేదిక ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కోవిడ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిందని, రోజుకు 500లోపు కేసులు మాత్రమే నమోదవుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. బుధవారం 272 కేసులు, గురువారం 250-300 కేసులు నమోదైన అంశాన్ని గుర్తుచేసింది. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల బ్రిటన్ స్ట్రెయిన్ రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపలేదని అభిప్రాయపడింది. అంచేత ఈ వ్యాజ్యాలను హైకోర్టు పర్యవేక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా చికిత్సకు కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అధిక బిల్లులు వసూలు చేయడం, పేద రోగులకు 15%పడకల రిజర్వు అంశం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సౌకర్యాల మెరుగు, సిబ్బంది నియామకాలపై ఉన్న మూడు ప్రజాహిత వ్యాజ్యాలపై మాత్రమే విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
related stories
-
ప్రధాన వార్తలు మీకు మాస్కు లేదు.. కేసు వాదించొద్దు
-
ఆరోగ్యం/జీవనం తినే ఆహారాన్ని కల్తీ చేస్తున్నారా. జీవితాంతం జైల్లోనే..?
-
కృష్ణ లోక్‌అదాలత్‌తో కేసులకు పరిష్కారం