Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కరువుతీరా వరద..!

కరువుతీరా వరద..!

బిరబిరా కృష్ణమ్మ... తుంగభద్రమ్మ పరుగులు

శ్రీశైలం డ్యాంలో చేరుతున్న 2,48,148 క్యూసెక్కులు

108.4880 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

తుంగభద్ర ప్రాజెక్టుకు 1.09 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

సాగునీటిపై టీబీపీ ఎల్లెల్సీ ఆయకట్టు రైతులు

సీమ జలాశయాలు నింపాలని రైతుల విన్నపాలు

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పైపైకి పోయాయి. కరువు ఛాయలు అలుముకున్న వేళ.. ఊహించని విధంగా కృష్ణమ్మ, తుంగభద్రమ్మ రాయలసీమ కరువు పల్లెలను కరుణించాయి. ఎగువ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉప్పొంగడంతో సీమ ప్రాజెక్టులు జలకళను సంతరిం చుకున్నాయి. ఈ అద్భుత జలవైభవాన్ని చూసి రైతన్నల గుండెలు ఆనందంతో ఉప్పొంగుతున్నాయి. అయితే.. ఆ నీరు తమ పొలాలకు ఎప్పుడు చేరుతుం దా..? అని ఎదురు చూస్తున్నారు. పాలకులు స్పందించి కీలక నిర్ణయా లు తీసుకోకపోతే.. ప్రకృతి ఇచ్చిన జలాలు వృథాగా సముద్రం పాలయ్యే ప్రమాదం లేకపోలేదు. శ్రీశైలం డ్యాంలో 108.4880 టీఎంసీలు వరద చేరితే.. తుంగభద్రకు 54.42 టీఎంసీలు చేరాయి. అంటే.. రెండు జలాశయాలు సగానికి పైగా నిండాయి.

కర్నూలు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం ప్రాజెక్టులో జలసిరులు పరవళ్లు తొక్కుతున్నాయి. జూరాల ప్రాజెక్టు గేట్లు దాటుకుని కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. శ్రీశైలం డ్యాంకు వరద పోటెత్తుతోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో జూరాల నుంచి 2,48,148 క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో నీటిమట్టం 860.80 అడుగులకు చేరుకోవడమే కాకుండా 108.4880 టీఎంసీల వరద చేరింది. భారీగా వరద చేరుతున్నా.. రాయలసీమ కాలువలకు నీటి విడుదలలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా గోదావరి వరద జలాలు ఎత్తిపోస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు 854 అడుగులు లెవల్‌ దాటి కృష్ణా వరద ప్రవాహం ఉంటే.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా వరద జలాలు తెలుగుగంగ, గాలేరు-నగరి కాలువకు మళ్లించి వెలుగోడు, గోరుకల్లు, అవుకు, కడప జిల్లాలో గండికోట, చిత్రావతి, పైడిపాలెం, బ్రహ్మంసాగర్‌ వంటి జలాశయాలు నింపేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం జూరాల నుంచి 2.48 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడం, ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి ఆశాజనకంగా వరద ఉంది. ఈ వరద ఇలాగే కొనసాగితే వారం నుంచి పది రోజుల్లో శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా కృష్ణా వరద జలాలు మళ్లింపుపై కూటమి ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని సీమ సాగునీటి నిపుణులు కోరుతున్నారు.

సాగుపై టీబీపీ ఎల్లెల్సీ రైతుల ఆశలు

రాయలసీమ కరువు జిల్లాలకు ప్రాణాధారం తుంగభద్ర జలాశయం. పశ్చిమ కనుమల్లో కురిసిన వర్షాలకు తుంగ ప్రాజెక్టు నుంచి భరీ వరద దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు తుంగభద్ర డ్యాంకు 1.09 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వరద కావడం కొసమెరుపు. జలాశయం గరిష్ట నీటి మట్టం 1633 అడుగులు, సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1617.43 అడుగుల లెవల్‌లో 54.42 టీఎంసీలు చేరాయి. ప్రస్తుతం రోజుకు సగటున 8-9 టీఎంసీలు చేరుతున్నాయి. వారం పది రోజులు ఇలాగే వరద చేరితే గరిష్ట సామర్థ్యం 105 టీఎంసీలకు చేరుతుంది. అదే జరిగితే క్రస్ట్‌ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయవచ్చని టీబీపీ బోర్డు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. తుంగభద్రలో ఆశాజనకంగా వరద చేయడం, భారీగా ఇన్‌ఫ్లో ఉండడంతో జిల్లా పశ్చిమ ప్రాంతం ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాలకు చెందిన టీబీపీ ఎల్లెల్సీ ఆయకట్టు రైతుల్లో సాగు ఆశలు చిగురిస్తున్నాయి. ఖరీఫ్‌లో 43,514 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. ఒక పంటకు నీరిచ్చినా కష్టాల నుంచి గట్టెక్కుతామని రైతులు అంటున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు స్పందించి తక్షణమే ఐఏబీ సమావేశం నిర్వహించాలి.. ఆయకట్టుకు సాగునీటి విడుదలపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఎండిన చెరువులకు జీవం పోయాలి

హంద్రీనీవా కాలువ కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో నందకొట్కూరు, పాణ్యం, డోన్‌, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో దాదాపు 95 చెరువులు, కృష్ణగిరి, పత్తికొండ (పందికోన) జలాశయాలు అనంతపురం జిల్లాలో చెరువులు, జలాశయాలు నింపుకోవాల్సి ఉంది. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు కురవకపోవడంతో చెరువు నీరు లేక నోళ్లు తెరిచాయి. ఎండిన చెరువులకు జీవం పోయాలంటే హంద్నీవా కాలువ నుంచి కృష్ణా వరద జలాలు ఎత్తిపోయాలి. శ్రీశైలం డ్యాం 834 అడుగులు లెవల్‌ దాటితే హంద్రీనీవా ద్వారా ఎత్తిపోతలు చేపట్టవచ్చు. ప్రస్తుతం డ్యాం 859.30 అడుగులకు చేరింది. దీంతో తక్షణమే కృష్ణా జలాల ఎత్తిపోతలు చేపట్టి ఎండిన చెరువులకు జీవనం పోయాలని రైతులు కోరుతున్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా పంపింగ్‌ ముమ్మరం చేసి ప్రతి నీటి బొట్టును కరువు ప్రాంతాలకు మళ్లిస్తే.. రాబోయే రోజుల్లో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తాగు, సాగునీటికి ఇబ్బందులు తీరుతాయి. గతేడాది జూలై 17న హంద్రీనీవా ద్వారా ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. 250 రోజులు కృష్ణా వరద జలాలు ఎత్తిపోసి 53.7425 టీఎంసీలు సీమ గ్రామాలకు మళ్లించారు. 2024-25లో ఆగస్టు ఒకటి నుంచి హంద్రీనీవా ద్వారా ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టి 222 రోజులు 29.4419 టీఎంసీలు ఎత్తిపోశారు. తాజాగా శ్రీశైలానికి ఆశాజనకంగా వరద చేరడంతో పాటు 2.48 లక్షల ఇన్‌ఫ్లో ఉండడంతో తక్షణమే హంద్రీనీవా ప్రాజెక్టు పంపులు ఆన్‌ చేసి వరద జలాలు లిఫ్ట్‌ చేయాలని కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy