ఈ నెల 18 నుంచి ఏడాదిన్నర పాటు
24/7 ట్రాఫిక్ పోలీసుల విధులు
హెచ్‌సిటీ ప్రాజెక్టు పనుల కోసమే..
ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణం
రాంగ్‌రూట్‌లో వస్తే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ: హెచ్ సిటీ ప్రాజెక్టు అభివృద్ధి పనుల్లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్‌ను అమలు చేయనున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీపీ.. ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, డీసీపీ కాజల్, జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌తో కలిసి వన్‌వే ట్రాఫిక్ వివరాలు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హెచ్ సీటీ ప్రాజెక్టులో ఫ్లైఓవర్లు, అండర్‌పా్‌సల నిర్మాణం పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా శరవేగంగా జరగడానికి ఆగస్టు-18 నుంచి సుమారు ఏడాదిన్నర పాటు వన్‌వే ట్రాఫిక్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి వన్-వే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామని సీపీ వెల్లడించారు.
వాహనదారులకు మార్గనిర్దేశం, సహాయం అందించడానికి ముఖ్యమైన ప్రదేశాలలో 24 గంటలూ ట్రాఫిక్ పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారని సీపీ తెలిపారు. ట్రాఫిక్ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకునేందుకు గూగుల్ మ్యాప్స్ / నావిగేషన్ రూట్లలో అవసరమైన మార్పులు చేస్తున్నామన్నారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఇచ్చే సూచనలను కచ్చితంగా పాటించాలని, ఎమర్జెన్సీ వాహనాలకు (అంబులెన్స్) దారి ఇవ్వాలన్నారు. రాంగ్-సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:

