వాటా ప్రకారమే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం
అనుమతులున్న వాటిపై అభ్యంతరాలు తగవు
రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వైఖరి
దీనిని దేశం మొత్తానికి తెలిసేలా చేస్తాం
ఏపీది అర్థం పర్థం లేని అనవసర రాద్ధాంతం
పిలిచి పీట వేస్తే.. కెలికి కయ్యం పెట్టుకుంటోంది
నోరు మూయించేలా వాదనలు తిప్పికొడతాం
మన ప్రాజెక్టులపై మళ్లీ మాట్లాడకుండా చేస్తాం
ఉమ్మడిలోనే ఉన్న ప్రాజెక్టులను తెలంగాణ
అవసరాల మేరకు రీ డిజైన్ చేసుకున్నాం
ఏపీకి, కేంద్రానికి దీటుగా జవాబు ఇద్దాం
ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ''తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి తప్పు.
ఏపీ నోరు మూయిస్తాం
''నా అంతట నేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి, పీటేసి, అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహహస్తం అందించాను. బేసిన్లు లేవు.. భేషజాలు లేవని మన వైఖరిని స్పష్టంగా చెప్పాను. స్నేహపూర్వకంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాను. వృథాగా సముద్రం పాలవుతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పాను. కానీ, ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోంది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థం లేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తోంది. అపెక్స్ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోరు మూయించేలా, అర్థరహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెబుదాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి కల్పిస్తాం'' అని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో రాష్ర్టానికి ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు తెలంగాణ ఏర్పడే నాటికే మంజూరై ఉన్నాయని గుర్తు చేశారు. వాటికి నీటి కేటాయింపులు జరిగాయని, సీడబ్ల్యూసీ సహా ఇతర సంస్థల నుంచి అనుమతులు వచ్చాయని వివరించారు. ''వాటిపై దాదాపు రూ.23 వేల కోట్ల వరకు నిధుల ఖర్చు జరిగింది. 31,500 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వాటిని కొత్త ప్రాజెక్టులు అనడం అర్థరహితం, అవివేకం. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోనే మంజూరైనా వాటిని పూర్తి చేయలేదు. పైగా, తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును ప్రతిపాదించారు. చాలా ప్రాజెక్టుల డిజైన్‌లను తెలంగాణ అవసరాలకు తగ్గట్టుగా చేయలేదు. అందుకే, తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రానికున్న హక్కులు, అవసరాలు, నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులను రీడిజైన్ చేసి నిర్మిస్తున్నాం. దీన్ని తప్పు పట్టడంలో అర్థం లేదు'' అని కేసీఆర్ మండిపడ్డారు. పెన్‌గంగ ప్రాజెక్టులకు 1975లోనే ఒప్పందం కుదిరి, ట్రైబ్యునల్ అవార్డు కూడా పూర్తయిందన్నారు. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఏయే అనుమతులు సాధించారు? తెలంగాణ వచ్చేనాటికే ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? విడుదల చేసిన జీవోలు.. తదితర వాస్తవాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా బహిరంగ పరిచి ఫిర్యాదులు చేసిన వారికి, సందేహాలు వెలిబుచ్చిన వారికి తిరుగులేని సమాధానం చెప్పాలని ఆదేశించారు.
మరో వెయ్యి టీఎంసీలు కేటాయించాలి
''గతంలో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంధ్రలో చేపట్టిన ముచ్చుమర్రిని తెలంగాణ ప్రస్తావించింది. దాంతో, రెండింటినీ కొనసాగించాలనే నిర్ణయం జరిగింది. మళ్లీ ఆ అంశాన్ని లేవనెత్తడం సరికాదు. వాస్తవాలను మరోసారి వివరిస్తాం'' అని వెల్లడించారు. మంచినీటి అవసరాల కోసం వాడే నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ట్రైబ్యునల్ చెప్పిందని, దాని ప్రకారం, 110 టీఎంసీల్లో 22 టీఎంసీలను మాత్రమే లెక్కకు తీసుకోవాలని చెప్పారు. ''సాగునీటి రంగంలో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయం జరిగింది. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జునసాగర్‌ను 17 కిలోమీటర్ల దిగువన కట్టడం వల్ల అన్యాయం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కారణంగా ఎగువ కృష్ణ, తుంగభద్ర, బీమా ప్రాజెక్టులు పోయాయి. నీటి వాటాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని సాక్షాత్తూ బచావత్ ట్రైబ్యునల్ పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తన నీటి వాటాను అడిగే సందర్భంలో తెలంగాణను పరిగణనలోకి తీసుకోలేదని స్వయంగా ట్రైబ్యునల్ గ్రహించి, తెలంగాణకు ప్రత్యేకంగా నీటిని కేటాయించింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన జూరాల, నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయిల్ సాగర్ తదితర ప్రాజెక్టులను తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి చేసుకోగలిగాం'' అని వివరించారు. గ్రావిటీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఆర్డీఎస్ తూములను ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు బాంబులు పెట్టి పేల్చడంతో రాలేదని, ఆర్డీఎస్ ఆయకట్టును స్థిరీకరించడానికి ఎంతో వ్యయం చేసి తుమ్మిళ్ల లిఫ్టు నిర్మించుకోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. సమావేశంలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

