జైపూర్: కొవిడ్ రోగులకు అవసరమైన మందులు, ఆక్సిజన్ కొరతపై కేంద్రంతో ''సీరియస్''గా మాట్లాడాలంటూ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలకు సీఎం అశోక్ గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు. ట్విటర్ వేదికగా ఆయన ఈ మేరకు ఎంపీలకు పిలుపునిచ్చారు. ''మందులు, ఆక్సిజన్, వ్యాక్సీన్ల కొరతను అధిగమించేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకునేందుకు పార్లమెంటు సభ్యులంతా ముందుకు రావాలి. ఏప్రిల్ 30 నాటికి కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతుందని నిపుణులు చెబుతున్నందున మందుల కొరత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి..'' అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై చర్చించేందుకు ఇవాళ ఆయన అత్యవసర మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేశారు.

