Dailyhunt
కేరళ రాష్ట్రం పేరు మార్పునకు రంగం సిద్ధం?

కేరళ రాష్ట్రం పేరు మార్పునకు రంగం సిద్ధం?

ఇంటర్నెట్ డెస్క్: కేరళ రాష్ట్రం పేరు మార్పునకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. రాష్ట్రాన్ని 'కేరళం' అని పిలిచేలా బిల్లుకు కేంద్ర కేబినెట్ నేడు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

త్వరలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వార్తలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.

తమ రాష్ట్రాన్ని కేరళం అని పిలవాలన్న డిమాండ్‌ మలయాళ ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది. ఈ దిశగా రాష్ట్ర ముఖ్య మంత్రి పినరయి విజయన్ 2023లోనే ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కొన్ని మార్పుల అనంతరం కేరళ అసెంబ్లీ మరోసారి తీర్మానాన్ని ఆమోదించింది. ఇది ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది.

తమ రాష్ట్రాన్ని మలయాళ భాషలో కేరళం అని పిలుస్తారని సీఎం విజయన్ గతేడాది తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన సందర్భంగా తెలిపారు. మలయాళ ప్రజలందరి కోసం ఐక్య కేరళ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ స్వాతంత్ర్య పోరాట కాలంలోనే ఉండేదని గుర్తు చేశారు. కానీ ఆంగ్ల భాష ప్రభావం కారణంగా రాజ్యాంగం మొదటి షెడ్యూల్‌లో రాష్ట్రం పేరును కేరళగా చేర్చారని అన్నారు. కేరళం పేరును ఒకటవ షెడ్యూల్‌లో చేర్చడంతో పాటు 8వ షెడ్యూల్‌ భాషల్లో రాష్ట్రం పేరును ఈ మేరకు మార్చేలా రాజ్యాంగ మూడవ అధీకరణ కింద సవరణ చేపట్టాలని కేంద్రాన్ని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy