Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఖతార్‌ విలవిల

ఖతార్‌ విలవిల

  • సహజవాయువు ఎగుమతులతో ఒకప్పుడు ఆర్థికంగా కళకళ

  • హోర్ముజ్‌ మూసివేతతో ఆగిపోయిన ఎల్‌ఎన్‌జీ ఎగుమతులు

  • ఇరాన్‌ దాడులతో దెబ్బతిన్న రాస్‌ లఫాన్‌ పారిశ్రామిక కేంద్రం

  • వందల కోట్ల డాలర్ల నష్టం.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి దేశం

దోహా, మే 18: ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన ఖతార్‌.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ మొదలుపెట్టిన యుద్ధం దెబ్బకు ఆర్థికంగా నలిగి విలవిలలాడిపోతోంది! విలువైన సహజవాయు నిక్షేపాలను ప్రపంచదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేసే ఖతార్‌.. హోర్ముజ్‌ జలసంధి దిగ్బంధనంతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. 1930లకు ముందు.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం.. ముత్యాల వేట! మేలిముత్యాల వేటకు ఆలవాలమైన ఒకనాటి ఆ ప్రాంతంలో.. ఆ తర్వాత కాలంలో పెద్ద ఎత్తున సహజవాయు నిక్షేపాలు బయటపడ్డాయి ప్రపంచంలోనే అతిపెద్ద సహజవాయు క్షేత్రం (నార్త్‌ ఫీల్డ్‌) ఖతార్‌లోనే ఉంది. ఆ దేశం దాదాపు మూడు దశాబ్దాల పాటు కష్టపడి.. ఆ సహజవాయువును ప్రపంచ దేశాలకు సరఫరా చేయడానికి అవసరమైన సరఫరా మార్గాలను అభివృద్ధి చేసుకుంది. దోహాకు ఉత్తరాన ఎడారిని చదునుచేసి నిర్మించిన రాస్‌ లఫాన్‌ పారిశ్రామిక నగరం 100 చదరపు మైళ్ల మేర విస్తరించింది. సహజవాయువును మైనస్‌ 162 డిగ్రీల సెల్సియ్‌సకు చల్లబరచి (సూపర్‌కూలింగ్‌) దాన్ని ద్రవరూపంలోకి మార్చి.. ఆ ద్రవీకృత సహజవాయువును (ఎల్‌ఎన్‌జీ) హోర్ముజ్‌ జలసంధి గుండా ఆసియా, ఐరోపా దేశాలకు పంపుతూ.. ఏటా వందల కోట్ల డాలర్లను ఆర్జిస్తోంది. 1996లో జపాన్‌కు 60 వేల టన్నుల ఎల్‌ఎన్‌జీని పంపిన ఖతార్‌ 2010 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 77 మిలియన్‌ టన్నులకు పెంచుకుని 'ఎనర్జీ సూపర్‌ పవర్‌'గా ఎదిగింది. అంతేకాదు.. రాజధానికి దక్షిణాన మరికొన్ని పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేసి ఎరువుల ఉత్పత్తిని ప్రారంభించింది. ఆ రకంగా కూడా ఖతార్‌ ఆదాయం అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా.. ఆ తర్వాత దశాబ్దకాలంపాటు తలసరి ఆదాయం పరంగా ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా ఖతార్‌ నిలిచింది.

పెరిగి.. విరిగి..

ఖతార్‌ వార్షిక ఆదాయంలో 60 శాతానికి పైగా గ్యాస్‌, గ్యాస్‌ ఆధారిత ఎగుమతుల ద్వారానే లభిస్తోంది. ఆ సొమ్ముతోనే.. ఎడారి ద్వీపకల్పమైన ఖతార్‌ ఒక మెరిసిపోయే మహానగరంగా మారింది. అపరిమితంగా వచ్చిపడుతున్న డబ్బుతో ఇసుక నేలల కింద నీటిపారుదల వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని పచ్చటి పచ్చికను పెంచారు. భారీ మాల్స్‌, కృత్రిమ మంచుతో కూడిన థీమ్‌ పార్కులు, మెట్రో రైల్‌ వ్యవస్థల వంటివాటిని సహజవాయు సంపదతోనే నిర్మించుకున్నారు. కానీ.. ఇరాన్‌పై అమెరికా యుద్ధం కారణంగా హోర్ముజ్‌ మూతపడడంతో ఖతార్‌ అదృష్ట రేఖ తిరగబడింది. పొరుగున ఉన్న సౌదీ అరేబియా, యూఏఈ లాగా పైప్‌లైన్ల ద్వారా ఇంధనాన్ని మళ్లించే మార్గం కూడా లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. ఎందుకంటే.. సముద్రంలోకి పొడుచుకొచ్చినట్టుగా ఉండే ద్వీపకల్పమైన ఖతార్‌కు మూడువైపులా ఉండే జలమే రవాణా మార్గం. అదీ హోర్ముజ్‌ గుండా బయటకు రావాల్సిందే. మరోవైపు, ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లు రాస్‌లఫాన్‌పై దాడి చేయడంతో కీలక పరికరాలు దెబ్బతిన్నాయి. ఈ దాడుల వల్ల ఆ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 17ు మేర క్షీణించినట్టు సమాచారం. మరోవైపు.. దోహాకు దక్షిణంగా ఉండే హమద్‌ పోర్టులో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఒకప్పుడు ఎల్‌ఎన్‌జీని లోడ్‌ చేసే క్రేన్ల చప్పుడు లేక ఆ రేవు మూగవోయింది. ఎగుమతులే కాదు.. వివిధ దేశాల నుంచి ఖతార్‌కు వాహనాలు, ఇతర ఉత్పత్తుల దిగుమతులు కూడా నిలిచిపోయాయి. పర్యాటక, వాణిజ్య రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎల్‌ఎన్‌జీ వాణిజ్యం నిలిచిపోవడంతో ఖతార్‌ ఆర్థిక వృద్ధి అంచనాలు భారీగా పడిపోయాయి. ఆదాయం కోసం కేవలం శిలాజ ఇంధనాలపైనే ఆధారపడకుండా ఉండేందుకు ఖతార్‌ చాలాకాలంగా పలు ప్రయత్నాలు చేస్తోంది. ఖతార్‌లో వ్యాపారం చేయాలంటే స్థానిక భాగస్వాములు ఉండాలనే నిబంధనను 2019లో రద్దు చేసింది. అక్కడ పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థలు వెళ్లిపోకుండా చూసుకునేందుకు ఇప్పుడు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే.. ఆ కంపెనీలు కూడా వెళ్లిపోతే.. వాటిలో పనిచేస్తున్న లక్షలాది మంది విదేశీయులు కూడా వెళ్లిపోతే.. ఖతార్‌ ఆర్థిక వ్యవస్థ నిండా మునిగినట్టే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy