Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!

ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ప్రపంచ అగ్రగామి గ్యాస్ ఉత్పాదక దేశమైన ఖతర్‌లో భారత రాయబారిగా ఓ తెలుగు దౌత్యవేత్తను నియమించినట్లుగా తెలిసింది.

2001 బ్యాచ్‌కు చెందిన డాక్టర్ కొప్పుల శ్రీకర్ రెడ్డిని నూతన భారతీయ రాయబారిగా కేంద్రం ఖరారు చేసినట్లుగా విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

హైదరాబాద్‌లో ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి నుంచి ఐక్యరాజ్య సమితి వరకూ వివిధ హోదాల్లో పని చేసిన ఆయన ఆఫ్రికా, అరబ్బు దేశాలతో భారత్ చేసుకొన్న చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందాల చర్చల్లో కీలకపాత్ర పోషించారు. ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత ప్రతినిధిగా కూడా వ్యవహరించిన ఆయన తన అనుభవంతో భారత-యూఏఈ సమగ్ర వాణిజ్య, ఆర్థిక వికాస ఒడంబడికలో భారత పక్షాన ముఖ్య భూమిక వహించారు. హైదరాబాద్‌లో పాస్‌పోర్టు అధికారిగా వ్యవహరించిన సందర్భంగా పాస్‌పోర్టు పోలీసు విచారణ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితంగా జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టినందుకు దేశవ్యాప్తంగా ఉత్తమ ఆవార్డును అందుకున్నారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖలో భారత దౌత్యవేత్తలు కీలకంగా భావించే పాకిస్థాన్ వ్యవహారాలను కూడా ఆయన పర్యవేక్షించారు. వియత్నాంలో పని చేసినప్పుడు ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన అధ్యాయానికి తెరతీశారు. ఐరోపాలో ప్రముఖమైన జర్మనీలో కూడా పని చేశారు. దౌత్యరంగంలో ఒక అనుభవంగా భావించే స్విట్జర్లాండ్‌లో కూడా పని చేసిన శ్రీకర్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో కౌన్సల్ జనరల్‌గా పని చేస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మండలానికి చెందిన ఆయన వరంగల్‌లో వైద్యవిద్య పూర్తి చేసిన అనంతరం 2001లో సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. ఆయన సతీమణి ప్రతిమ కూడ ఉన్నత విద్యావంతురాలు కానీ సౌమ్యంగా, సాధారణ గృహిణిగా ఉంటారు.

గల్ఫ్ దేశాలన్నింటిలోనూ భారత్‌తో సున్నిత సంబంధాలు కలిగిన ఖతర్‌లో భారత రాయబారికి ప్రాధాన్యం ఉంది. నాలుగు దశాబ్దాల క్రితం ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం ప్రొఫెసర్ సయ్యద్ బషీరుద్దీన్ కూడా ఖతర్‌లో భారత రాయబారిగా పని చేసిన తరువాత ఇప్పుడు మళ్లీ ఒక తెలుగు అధికారి రానున్నారు. కొంత మంది తెలుగు దౌత్యవేత్తలు క్యాడర్ పోస్టింగులలో భాగంగా వివిధ హోదాలలో ఖతర్‌లో పని చేసినా రాయబారి స్థాయిలో అవకాశం దక్కింది ఈ ఇద్దరికే.

భారతీయ ఎరువులు, విద్యుత్ రంగంలో ఖతర్ గ్యాస్ దిగుమతి కీలక పాత్రవహిస్తుంది. ఖతర్‌లో దాదాపు ఎనిమిది లక్షల మంది భారతీయులు పని చేస్తున్నారు. శ్రీకర్ రెడ్డి రాక సమాచారంపై ఖతర్‌లోని ప్రవాసీ తెలుగు సమాజం సంతోషం వ్యక్తం చేస్తోంది. వాస్తవ పరిస్థితుల ఆధారంగా సీరియస్‌గా పని చేస్తూ జాతి ప్రయోజనాల గురించి పాటుపడే దౌత్యవేత్త కావడంతో శ్రీకర్ రెడ్డి వాణిజ్య మంత్రిత్వ శాఖలో అధ్భుతాలను సాధించి, సీరియస్, బిజినెస్ డిప్లోమాట్‌గా గుర్తింపు పొందారు.

చేతలతో కాకుండా మాటలతో, ఎంబసీ వేడుకలతో కాలం గడుపుతూ తృప్తి చెందే వారు పెరిగిపోవడానికి తోడుగా ప్రతి వారం శాలువాల సన్మానంతో విసుగెత్తిస్తున్న తెలుగు ప్రవాసీ నాయకగణం నూతన రాయబారి వచ్చిన తరువాత పంథాను మార్చుకుంటుందా? లేదా కొనసాగిస్తుందా ? అనేది తెలుసుకునేందుకు వేచి చూడాలి. ప్రస్తుత రాయబారి విపుల్ ఈ నెలాఖరులో వెళ్లిపోయిన అనంతరం శ్రీకర్ రెడ్డి ఖతర్‌కు వస్తారని భావిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

బహ్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితుల నడుమ బోనాల పండుగ

మిస్సోరీలో శతచండీ సహిత రుద్రయాగంలో సహస్ర కుంకుమార్చన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy