న్యూఢిల్లీ: భూతాపం పెంచుతున్న వాతావరణ మార్పులను అరికట్టే దిశగా అమెరికా నేతృత్వంలో నేడు క్లైమెట్ సమ్మిట్ ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో జరుగుతున్న ఈ సమావేశంలో వివిధ దేశాలు పాల్గొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సమావేశాలను ప్రారంభించారు. భారత్ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ హితం కోసం అమెరికా, భారత్ 'ఇండియా-యూఎస్ క్లైమెట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 పార్టనర్షిప్' పేరిట నూతన భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నట్టు ప్రకటించారు. క్లైమెట్ సమ్మిట్‌లో మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే..
''సమావేశం ఏర్పాటుకు చొరవ తీసుకున్న అధ్యక్షుడు జో బైడెన్‌కు ధన్యవాదాలు!
పర్యావరణ రక్షణ కోసం అమెరికా, భారత్ 'ఇండియా-యూఎస్ క్లైమెట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 పార్టనర్షిప్' పేరిట ఓ కొత్త భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పుతున్నట్టు పేర్కొన్నారు. ''పర్యావరణం పట్ల బాధ్యతాయుత వైఖరి కలిగిన భారత్ సుస్థిర అభివృద్ధి సాధించేందుకు సలహాలు , సూచనలను ఎల్లప్పుడూ స్వాగతిస్తుంది. ఖరీదైన హరిత సాంకేతికతను అభివృద్ధి చెందిన దేశాలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. అందుకే.. భారత్, అమెరికా ఈ నూతన భాగస్వామ్యాన్ని నెలకొల్పాయి. లక్ష్యం చేరుకునేందుకు అవసరమైన నిధులు, సాంకేతికత, భాగస్వామ్యాలను రెండు దేశాలు కలిసి సాధిస్తాయి'' అని మోదీ పేర్కొన్నారు. కాగా.. సమావేశంలో తొలుత ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్..అమెరికా గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో 2030 నాటికల్లా 50 నుంచి 52 మేర కోత విధిస్తామని ప్రకటించారు.

