ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అయోధ్య రామ మందిరంపై వివాస్పద వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ తెలంగాణ ఎన్నారై సెల్ మిడిల్ ఈస్ట్ విభాగం నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం సమావేశమైన సందర్భంగా అధ్యక్షుడు నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ.. ఒక్కసారి అయోధ్య గురించి, రామాయణం గురించి తెలుసుకోవాలని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీయడం సరికాదని మండిపడ్డారు.
అంతేకాకుండా.. 'శ్రీరాముడు పుట్టిన పరమపవిత్ర స్థలమైన అయోధ్యలో.. మందిరం నిర్మించాలని హిందువులు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారు. ఈ పోరాటంలో చాలా మంది తమ ప్రాణాలను కూడా కోల్పోయారు.
తెలంగాణలో ఎన్నో అయ్యప్ప దేవాలయాలు ఉండగా.. శబరిమలకు ఎందుకు వెళ్తున్నారని నరేంద్ర పన్నీరు.. విద్యాసాగర్ రావును ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో శివాలయాలు, వేంకటేశ్వర స్వామి ఆలయాలు ఉండగా.. సీఎం కేసీఆర్.. శ్రీకాళహస్తి, భద్రాచలం, తిరుపతికే ఎందుకు వెళ్తున్నారో సమాధానం చెప్పి తీరాలన్నారు. మీరు చేస్తే ఒప్పు.. తెలంగాణ హిందువులు చేస్తే తప్పా అని ప్రశ్నించారు. దీనిపై కల్వకుంట్ల విద్యాసగర్ రావు వివరణ ఇచ్చి.. హిందూ సమాజానికి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుమార్ మంచికట్ల, కార్తిక్ వంకాయల, సంతోష్ బసవరాజుల, వేమాన్ కుమార్ కాశ, శ్యాం మామిడి, రమేష్ గరిగే, గురువయ్య చెనితోపాటు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

