Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'కొత్త'లో అన్నీ వాతలే!

అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నూతన పారిశ్రామిక విధానం అంటే పాత విధానం కంటే బాగుండాలి! కానీ, అందులో ఇచ్చిన ప్రోత్సాహకాలను కూడా ఇందులో లేకుండా చేస్తే ఏమనాలి? నూతన పారిశ్రామిక విధానం అచ్చం అలాగే ఉందని పలువురు పెదవి విరుస్తున్నారు. గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పరిశ్రమలు పెట్టుకోడానికి భూమిని కేటాయిస్తే దాని ధరలో 50శాతం సబ్సిడీ ఇచ్చేవారు. ఒకప్పుడు ఎస్సీ, ఎస్టీలకే ఈ సౌకర్యం ఉండగా...చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు కూడా దీన్ని వర్తింపజేసింది. నూతన పారిశ్రామిక విధానంలో ఈ సబ్సిడీ గల్లంతైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ భూమి కొనుగోలులో ఎలాంటి రాయితీ లేదు. ఇప్పుడు కేవలం ఆయా వర్గాల్లోని మహిళా పారిశ్రామికవేత్తలకు మాత్రం 50శాతం రాయితీ ఉంటుందని పేర్కొన్నారు.

మరోవైపు పెట్టుబడి ప్రోత్సాహకం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 15శాతం, ఈ వర్గాలకు చెందిన మహిళలకు 35శాతంగా పేర్కొన్నారు.

ఇక్కడ కూడా కోత విధించారు. ఎస్సీ, ఎస్టీలకు పెట్టుబడి సబ్సిడీ 35శాతం, ఆ వర్గాల్లోని మహిళలకు 45శాతం గతంలో ఉండేది. ఇప్పుడు ఇది ఈ వర్గాల్లోని మగవారికి కేవలం 15శాతమే. మహిళలకు 35శాతానికి తగ్గించారు. పెట్టుబడి ప్రోత్సాహకాన్ని మూడేళ్ల తర్వాత ఇస్తామని నూతన విధానంలో పేర్కొన్నారు. అప్పటికి సద రు పరిశ్రమ ముందు చెప్పిన ఉద్యోగాల కల్పన, ఉత్పత్తిలో 80శాతం లక్ష్యాన్ని సాధిస్తేనే ఈ సబ్సిడీ ఇస్తామన్నారు. మూడేళ్ల తర్వాత అంటే కచ్చితంగా పరిశ్రమదారులకు కష్టమేనని అంటున్నారు. సాధారణంగా పరిశ్రమలు స్థాపించేవారికి తొలినాళ్లలోనే అవసరాలు అధికంగా ఉంటాయి. పరిశ్రమ గాడిన పడేవరకు ఆర్థికంగా పెట్టుబడి పెడుతుండాలి. అంటే తొలి రెండు, మూడేళ్లపాటు నిధులు అవసరం.

ప్రోత్సాహకం ఏది?

స్థానికులకే 75శాతం ఉద్యోగాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానం తీసుకొచ్చింది. అయితే అలా ఉద్యోగాలిచ్చే కంపెనీలకు ఏదైనా అదనపు ప్రోత్సాహకం ఇచ్చేదిశగా కొత్త విధానంలో ఏమీ పొందుపరచలేదని పలువురు పేర్కొంటున్నారు. తెలంగాణలో స్థానికంగా 75శాతం ఉద్యోగాలిచ్చే కంపెనీలకు...విద్యుత్‌ సబ్సిడీని యూనిట్‌కు అదనంగా 50పైసలు ఇస్తున్నారు. ఇక్కడ కూడా అలాంటి అదనపు ప్రోత్సాహకం అందిస్తే బాగుండేదని అంటున్నారు.

పన్ను రాయితీల్లో కోత.. గత విధానంలో అమ్మకం పన్నుకు తొలి ఐదేళ్లు అపరిమితంగా రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం ఉండేది. అంటే కొత్తగా పెట్టిన పరిశ్రమ తొలి ఐదేళ్లపాటు అమ్మిన వస్తువుల విలువ ఎంత ఉన్నా దానిపై అమ్మకం పన్ను రీయింబర్స్‌మెంట్‌ వచ్చేది. కానీ ఇప్పుడు స్థిర పెట్టుబడికి సమానమైన మొత్తంపైనే అమ్మకం పన్ను రీయింబర్స్‌ అన్నారు. ఉదాహరణకు ఒక పరిశ్రమ పెట్టేందుకు రూ.50లక్షల స్థిర పెట్టుబడి అయితే....అంతవరకు విలువ కలిగిన అమ్మకాల మీదే పన్ను రీయింబర్స్‌ ఇస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy