Dailyhunt
కోవిడ్-19పై పోరు.. భారీ ప్రణాళికతో ముందుకొచ్చిన టాటా గ్రూప్

కోవిడ్-19పై పోరు.. భారీ ప్రణాళికతో ముందుకొచ్చిన టాటా గ్రూప్

ముంబై: చైనాలోని ఒక చిన్న ప్రాంతంలో పుట్టి ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది కరోనా వైరస్. దీని బారిన పడి ఇప్పటికే ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది ఈ వైరస్ బారిన పడి అల్లాడుతున్నారు. ఈ మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. అయితే ఇప్పటికే కరోనాపై పోరాటం చేసేందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా ప్రకటిస్తున్నారు.

దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రతన్ టాటా కరోనా నివారణ కోసం భారీ ప్రణాళికతో ముందుకొచ్చారు. దేశాన్ని ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకొనేందుకు ఏకంగా రూ.500 కోట్లను వెచ్చించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన సోషల్‌మీడియా ద్వారా తెలిపారు.

''ప్రస్తుతం భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను ఎదురుకొనేందుకు సత్వరమే నడుంబిగించాలి. గతంలో దేశం కష్టపరిస్థితులు ఎదురుకున్నప్పుడు టాటా ట్రాస్ట్స్ మరియు టాటా గ్రూప్ కంపెనీలు ఆదుకొనేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఈ సంక్షోభాన్ని ఎదురుకొనేందుకు మరింత అదనంగా పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

ఇది చాలా క్లిష్టమైన సమయం, కోవిడ్-19ను ఎదురుకొనేందుకు ఎంతో అత్యవసర వనరులు మనకు అవసరం. ఇది మానవ జాతి ఎదురుకుంటున్న అతి పెద్ద సవాల్.

అందుకే టాటా ట్రస్ట్ తరఫున బాధితులను ఆదుకొనేందుకు, వారి సంరక్షణ కొరకు రూ.500 కోట్లను...

  • ప్రధానంగా వైద్యసేవల పరికారల కొనుగోలుకు
  • శ్వాసకోశ వైద్యానికి కావాల్సిన పరికరాలకు
  • ప్రతీ ఒక్కరికీ సరిపడేలా టెస్టింగ్ కిట్లకు
  • వ్యాధిగ్రస్తుల కోసం అత్యధునిక వైద్య సదుపాయాలకు
  • వైద్యసేవలు చేసేవారికి, ప్రజలకు దీనిపై మరింత అవగాహన కార్యక్రమాలు కల్పించేందుకు ఖర్చు చేస్తామని హామీ ఇస్తున్నాము

స్థానిక, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి టాటా గ్రూప్స్ ఈ మహత్త్కార్యానికి పూనుకుంది. అంతేకాక.. ప్రభుత్వంతో కలిసి.. ప్రజల భాగస్వామ్యంతో ఈ సంక్షోభాన్ని ఎదురుకొని దేశంలోని మారుమూలల్లో ఉన్న ప్రతీ ఒక్కరికి తగిన వైద్యసదుపాయం అందేలా టాటా ట్రస్ట్, టాటా సన్స్ మరియు టాటా గ్రూప్‌ ఆఫ్ కంపెనీలు కృషి చేస్తాయి.

ఈ మహమ్మారిపై పోరాటం చేస్తున్న ప్రతి వ్యక్తికి, ప్రతి సంస్థపై మాకు ఎనలేని గౌరవం ఉంది. వారికి మా వందనాలు'' అంటూ రతన్ టాటా తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేశారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy