ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అగ్రిమెంట్ ఒకరిది.. వ్యాపారం మరొకరిది అన్నట్లుగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ వాణిజ్య సముదాయాల పరిస్థితి ఉంది.
ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి చెందిన వ్యాపార సముదాయాలు, టేలాల అద్దెల్లో ఆక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో మున్సిపల్ ఆదాయానికి గండిపడుతోంది. దుకాణాల నుంచి మున్సిపాలిటీకి ప్రతినెల రూ. లక్షల ఆదాయం సమకూరాల్సి ఉంది. దుకాణాలను అద్దెకు తీసుకున్న కొందరు వ్యాపారులు ఇతరులకు అద్దెకిచ్చి గుడ్‌విల్ పేరిట జేబులు నింపుకుంటున్నారు.మున్సిపల్ దుకాణాలను గతంలో అద్దెకు తీసుకున్న వారు వివిధ కారణాలతో విరమించుకున్నారు. నిబంధనల ప్రకారం ఖాళీ చేసిన దుకాణాల తాళాలను మున్సిపల్ అధికారులకు అప్పగించాలి. అధికాకులు ఇలాంటి దుకాణాలకు టెండర్ నిర్వహించి ఇతరులకు అద్దెకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దుకాణాలను అద్దెకు తీసుకున్న వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దుకాణాలను బినామీలకు అప్పగించి వారి నుండి గుడ్‌విల్ పేరిట కొంత సొమ్ము తీసుకుంటున్నారు. ఇలాంటి వారు చాలా మంది ఉండటంతో మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడుతోంది.
మున్సిపల్ పరిధిలో..
ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో మూడు దుకాణ సముదాయల్లో 41 గదులు అద్దె ప్రతిపాదికన కొనసాగుతున్నాయి. వీటి ద్వారా నెలకు రూ. 1.90 లక్షల వరకు అద్దె వస్తుంది. అలాగే 200కు పైగా టేలాలను మున్సిపల్ స్థలంలో వేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా నెలకు రూ. 1.50 లక్షల వరకు వస్తుంది. మున్సిపల్ నుంచి అద్దె రూపంలో పొందిన వారిలో చాలా మంది ఇతరులకు అదిక కిరాయిలకు ఇచ్చి ఆదాయాన్ని తమ జేబుల్లోకి వేసుకుంటున్నారు. టేలాలకు మున్సిపల్ అధికారులు రూ. 500 నుంచి 600 వరకు అద్దె నిర్ణయించారు. కొందరు టేలాలను ఇతరులకు అద్దెకిచ్చి రూ. 3,500 నుంచి రూ. 10వేల వరకు తీసుకుంటున్నారు.
నోటీసులు జారీ చేస్తాం..
-అంజయ్య, మున్సిపల్ కమిషనర్
మున్సిపల్ సముదాయాలలో సబ్‌లీజ్ వ్యవహరం తన దృష్టికి వచ్చింది. త్వరలోనే వారికి నోటిసులు అందజేస్తాం. బినామీలను తొలగించి అర్హులైన వారికి అందజేస్తాం.

