Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
kumaram bheem asifabadఅరుదైన వృక్ష శిలాజాలు

kumaram bheem asifabadఅరుదైన వృక్ష శిలాజాలు

- 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు అధికారుల వెల్లడి

సిఫాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సహజ వనరులకు ఆలవాలం. వీటికితోడు అరుదైన అద్భుత వృక్ష శిలాజాలున్నాయి.

కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌ పరిధిలోని మారుమూల పెంచికల్‌పేట్‌ మండలం కొండపల్లి అడవుల్లో 13ఏళ్ల కిందటే వీటిని కనుగొని రక్షణకు అప్పటి అధికారులు ప్రతిపాదనలు పంపినా అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి ఫాసిల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై పెరిగిన వృక్షాల సజీవ సాక్ష్యాలు ఇవి. ప్రకృతి సృష్టించిన ఆ అద్భుతాలు ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యం, రక్షణ లేమి కారణంగా కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదంలో పడ్డాయి.

- పెంచికల్‌పేటకు సమీపంలో..

కుమరం భీం జిల్లా పెంచికల్‌పేట మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి అటవీ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అరుదైన వృక్ష శిలాజాల జాడను 2013లో అటవీ శాఖ అధికారులు, పరిశోధకులు గుర్తించారు. సుమారు ఆరున్నర కోట్ల ఏళ్ల కంటే పూర్వం నాటివిగా భావిస్తున్నారు. ఆయా గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో అన్వేషిస్తే 30 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల వృక్షశిలాజాలు కనబడుతాయి. కొన్ని 9 నుంచి 25 అడుగుల పొడవు ఉంటాయి. మరికొన్ని 50 అడుగులు ఉండి ముక్కలయ్యాయి. కోట్ల సంవత్సరాల క్రితం సంభవించిన భౌగోళిక మార్పుల వల్ల భారీ వృక్షాలు భూమిలో కూరుకుపోయి ఆ తర్వాత భూగర్భంలోని సిలికా, ఇతర ఖనిజాల ప్రభావంతో ఇవి రాతి స్తంభాలుగా రూపాంతరం చెందాయి. చెట్టు బెరడు, లోపలి పొరలు కూడా స్పష్టంగా కనిపిస్తూ చూసేవారిని అబ్బురపరుస్తాయి. ఈ ప్రాంతాన్ని జాతీయ వారసత్వ సంపదగా గుర్తించి రక్షించాల్సి ఉంది. కానీ కనీస రక్షణ చర్యలు కూడా కరువయ్యాయి. మైదాన ప్రాంతంలో ఉండడం వల్ల ఏటా వర్షాకాలంలో వచ్చే వాగుల వరద ఉధృతికి ఈ అరుదైన శిలాజాలు కొట్టుకుపోతున్నాయి. మరికొన్ని మట్టిలో పూడుకుపోతున్నాయి. అటవీ ప్రాంతం కావడంతో పశువుల కాపరులు, అటుగా వెళ్లేవారు వీటిపై నడవడం వల్ల ఇవి ముక్కలుగా విరిగిపోతున్నాయి.

- టూరిజం హబ్‌గా..

పెంచికల్‌పేట అడవులను టూరిజం హబ్‌గా మార్చడంతో పాటు, ఈ శిలాజాలను కాపాడేందుకు ఇక్కడ ఒక ప్రత్యేక ఫాసిల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు, చరిత్ర పరిశోధకులు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దుల్లోని గడ్చిరోలికి 15 కిలోమీటర్ల దూరంలోని ప్రాణహిత- గోదావరి బేసిన్లో వడదాంలో సారోఫోడ్స్‌ సరీసృపాల జాడలు గతంలో వెలుగుచూశాయి. వాటి శిలాజాలను పరిశోధకులు కనుగొన్నారు. అవి ఆరున్నర కోట్ల ఏళ్లకు పూర్వ కాలానికి చెందినవిగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ద్వారా గుర్తించారు. అక్కడి ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని వడదాం ఫాసిల్‌ పార్కుగా మార్చింది. కానీ కొండపల్లి ఆటవీ ప్రాంతానికి చేరువుగా ఉండడంతో.. ఇక్కడి వృక్ష శిలాజాల వయసు కూడా అంతే ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. జిల్లాలోని అడవి వృక్షశిలాజాలు ఉన్న ప్రాంతాన్ని రక్షించేందుకు ఫాసిల్‌ పార్క్‌గా గుర్తించాలని చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటు గైడ్‌ను నియమిస్తే పర్యాటకులకు ఇదొక గొప్ప విజ్ఞాన కేంద్రంగా మారుతుంది. ఇక్కడ పర్యాటకం అభివృద్ధి చెందితే స్థానిక గిరిజనులకు, యువతకు గైడ్‌లుగా, ఇతర రూపాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంతరించిపోతున్న ఈ ప్రాచీన భూగర్భ చరిత్రను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy