కూటమితోనే సంక్షేమం
ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి తరలిరావాలి
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గంట్యాడ, జూలై 30(ఆంధ్రజ్యోతి): కూటమి వచ్చాకే సంక్షేమం గాడిన పడిందని, అనేక పథకాలు అమలు జరుగుతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
గొడ్డలి ప్రభుత్వ ఐదు సంవత్సరాల విధ్వంస పాలన కారణంగా రాష్ట్రం వెనకబడిపోయిందన్నారు. మురపాక గ్రామంలో గురువారం ఆయన పేదలకు పింఛను పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్తూ లబ్ధిదారులతో మాట్లాడారు. గ్రామంలో రూ.58.60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి భారీగా స్వాగతం పలకాలన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆరు జిల్లాలకు రూ.574 కోట్లను పింఛను రూపంలో ముందుగా అందజేశామన్నారు. అనంతరం ఇంటింటికీ తెలుగుదేశం కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జామి మండల పరిశీలకుడు ఆకాశపు స్వామి, బీజేపీ నాయకురాలు రెడ్డి పావని, జనసేన నాయకుడు సురేష్, టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

