Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కుట్రతోనే బీజేపీ కార్పొరేటర్లకు నిధులు కేటాయించడం లేదు

రాంనగర్‌ బీజేపీ కార్పొరేటర్‌ కె.రవిచారి

హైదరాబాద్/రాంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేటర్లకు బడ్జెట్‌ కేటాయించకుండా అభివృద్ధిని అడ్డుకుంటోంది. గ్రేటర్‌ పరిధిలో బీజేపీ కార్పొరేటర్లు ఎక్కువ మంది గెలిచిన నేపథ్యంలో కార్పొరేటర్లకు బడ్జెట్‌ కేటాయిస్తే బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లకు పేరు వస్తుందని, తద్వారా బీజేపీ బలపడుతుందనే కుట్రతోనే ప్రభుత్వం కార్పొరేటర్లకు నిధులు ఇవ్వకుండా ఎమ్మెల్యేలకు కేటాయిస్తోందని రాంనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌(బీజేపీ) కె.రవిచారి ఆరోపించారు. రాంనగర్‌ డివిజన్‌లో ఉన్న ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారానికి చేస్తున్న కృషిపై రవిచారితో 'ఆంధ్రజ్యోతి' ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రజ్యోతి : రాంనగర్‌ డివిజన్‌లో ఏ బస్తీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

కార్పొరేటర్‌: డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. కొన్ని చోట్ల డ్రైనేజీ నిండి ఇళ్లల్లోకి చేరుతోంది. ప్రతి రోజూ ఉదయం సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎయిర్‌టెక్‌ మిషన్‌ లేదా సిబ్బందిని పిలిపించి తాత్కాలికంగా సమస్యను పరిష్కరిస్తున్నాం. పూర్తి పరిష్కారం కావాలంటే జనాభాకు అనుగుణంగా పైప్‌లైన్‌ సామర్థ్యం పెంచాలి. ఇందుకోసం జలమండలికి నిధులు కేటాయించాలి.

ఆంధ్రజ్యోతి : కలుషితనీటి సమస్య తీవ్రంగా ఏ బస్తీలో ఉంది, పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

కార్పొరేటర్‌ : డివిజన్‌లో చాలా వరకు మురికివాడలు, బస్తీలు ఉన్నాయి. దీంతో డ్రైనేజీ లైన్లు, తాగునీటి లైన్లు కలిసిపోయి నల్లాల్లో కలుషిత నీరు వస్తోంది. ఈ సమస్య కృష్ణానగర్‌, రిసాల, చిక్కడపల్లి, న్యూఅచ్చయ్యనగర్‌, పాలమూరు బస్తీ ప్రాంతాల్లో ఉంది. వీటి పరిష్కారానికి నూతన లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. లోప్రెషర్‌ సమస్య పరిష్కారానికి కూడా రోజూ అధికారులతో మాట్లాడడం, పలుమార్లు ధర్నాలు కూడా జరుగుతున్నాయి.

ఆంధ్రజ్యోతి : డివిజన్‌లో పాత స్తంభాలు, విద్యుత్‌ సరఫరా ఎలా ఉంది, నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

కార్పొరేటర్‌ : డివిజన్‌లోని చాలా బస్తీలు, కాలనీలు, ప్రధాన రోడ్లలో మూడు దశాబ్దాల క్రితం వేసిన ఇనుప స్తంభాలు ఉన్నాయి. అవి ఇప్పడు తుప్పుపట్టి ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితి ఉంది. వీటిని మార్చాలని విద్యుత్‌ శాఖ అధికారులను కోరగా, కొత్తగా సిమెంట్‌ స్తంభాలు ఏర్పాటు చేశారు. కానీ విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వలేదు. దీంతో పరిస్థితి దయనీయంగా ఉంది.

ఆంధ్రజ్యోతి : ప్రభుత్వ శాఖ అధికారుల నుంచి సహకారం ఉందా, సమస్యలపై స్పందిస్తున్నారా?

కార్పొరేటర్‌ : డివిజన్‌లోని సమస్యలపై జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్‌, సివిల్‌ సప్లై, రెవెన్యూ శాఖల అధికారులకు ఎలాంటి ఫిర్యాదు చేసినా వారి నుంచి స్పందన నామమాత్రంగా ఉంది. ఎమ్మెల్యేకు చెప్పకుండా అధికారులు ఎలాంటి పనులు చేయడం లేదు. అయినా సమస్యలను పరిష్కరించి డివిజన్‌ అభివృద్ధికి కృషిచేస్తున్నాం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy