ఇంటర్నెట్ డెస్క్: రక్షాబంధన్ రోజున తోబుట్టువులకు అండగా నిలబడతామని సోదరులు హామీ ఇచ్చినట్టు.. జార్ఖండ్‌లోని గ్రామీణ వాసులు ఓ హామీ ఇస్తున్నారు. చెట్లకు రాఖీలు కట్టి, తాము ప్రకృతిని నిత్యం పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు.
అయితే వీళ్లు ఒకటి, రెండు కాదు.. ఏకంగా లక్ష చెట్లకు రాఖీలు కడుతున్నారు. ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా ఆ రాష్ట్రంలోని దాదాపు 700 గ్రామాల ప్రజలు ఏకమై ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు.
ఒక్క రాఖీ పౌర్ణిమ రోజుకే పరిమితం కాకుండా 'సేవ్ ట్రీ' పేరిట నెల రోజులపాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు. 30 రోజుల్లో రాష్ట్రంలోని 24 జిల్లాల్లో మూడు లక్షల చెట్లకు పైగా రాఖీలు కట్టాలని లక్ష్యం పెట్టుకున్నట్టు అక్కడి అటవీ సంరక్షణాధికారి ఒకరు తెలిపారు. ఇదివరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న ధన్‌బాద్ జిల్లాలోని లుకైయా గ్రామంలో చెట్లకు రాఖీలు కట్టే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇప్పటివరకు దాదాపు 12,000 గ్రామాలను ఈ కార్యక్రమం కోసం అనుసంధానం చేశామన్నారు. కాగా గతంలో లుకైయా గ్రామంలో కాపాడిన 20 వేల ఇప్ప చెట్ల ప్రస్తుతం ఆ గ్రామ ప్రజలకు చక్కటి ఉపాధిని అందిస్తున్నాయి.

