Thursday, 05 Aug, 3.56 am ఆంధ్రజ్యోతి

అమరావతి
లక్ష మందితో దండోరా సభ

ఒక్కరు తక్కువైనా గులాంగిరీ చేస్తాం

దళితులకు ప్రకటించినట్లే గిరిజనులకూ రూ.10 లక్షల చొప్పున సాయం అందించాలి

కోవర్టులపై కఠిన చర్యలు: రేవంత్‌రెడ్డి

ఇంద్రవెల్లి నుంచే గిరిజన ఉద్యమం: భట్టి

కాంగ్రెస్‌లో చేరిన ఆదిలాబాద్‌ గిరిజన నేతలు

హైదరాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): దళితులకు ప్రకటించినట్లే.. గిరిజన కుటుంబాలకూ రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఎంత నిర్బంధం విధించినా ఈ నెల 9న ఇంద్రవెల్లిలో లక్ష మందితో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. లక్ష మందికి ఒక్కరు తక్కువైనా గులాంగిరీ చేస్తామని ప్రకటించారు. తుడుం దెబ్బ అంటే ఉడుము పట్టేనని నిరూపిస్తామన్నారు. బుధవారం ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గిరిజన నేతలు గాంధీభవన్‌లో కాంగ్రె్‌సలో చేరిన సందర్భంగా, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సన్నద్ధతపై ఇందిరాభవన్‌లో నిర్వహించిన సమావేశంలోనూ రేవంత్‌ మాట్లాడారు. గిరిజనుల కష్టాలను ప్రభుత్వం గుర్తించడం లేదని మండిపడ్డారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో దళితుల ఓట్లు కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్‌ ఇంటికి రూ.10లక్షలు ప్రకటించారని, రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు ఇస్తారో మాత్రం చెప్పడం లేదని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ నుంచి గెలిచి.. టీఆర్‌ఎ్‌సలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఇసుక, అటవీ సంపదను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇంద్రవెల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఉద్యమం ప్రారంభమవుతుందన్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ మాట్లాడుతూ గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌, దళితులకు 3 ఎకరాల చొప్పున భూమిని ఎందుకు ఇవ్వలేదో కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు.

కోవర్టుల పని పడతాం..!

పార్టీలో కేసీఆర్‌ కోవర్టులు ఇంకా ఎవరైనా ఉంటే వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్‌ హెచ్చరించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఇప్పుడు పోటీ చేయబోయే అభ్యర్థే 2023 ఎన్నికల్లోనూ అభ్యర్థిగా కొనసాగుతారన్న సంకేతాలిచ్చారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అభ్యర్థిని సిఫార్సు చేయాలని దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌లకు సూచించారు. సీఎం కేసీఆర్‌ 65వ కళగా 'కోవర్టు'ను ప్రోత్సహిస్తూ కౌశిక్‌ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్‌ లక్ష్యంగానే ప్రధానంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని రేవంత్‌ స్పష్టం చేశారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. గాంధీభవన్‌ సీనియర్‌ ఉద్యోగి షబ్బీర్‌ ఇటీవల మరణించగా.. ఆయన కుటుంబాన్ని రేవంత్‌ పరామర్శించారు.

ఆత్మగౌరవ దండోరాకు రాహుల్‌!

ఈ నెల 9నుంచి సెప్టెంబరు 17వరకూ జరిగే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాలో ఏదో ఒకరోజున రాహుల్‌గాంధీ పాల్గొంటారని రేవంత్‌ ప్రకటించారు. కాగా, వరంగల్‌ను రాహుల్‌ సభకు ఎంచుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆ సభలోనే హుజూరాబాద్‌ అభ్యర్థిని ప్రకటించవచ్చని తెలుస్తోంది. రాహుల్‌గాంధీ 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top