Monday, 08 Mar, 3.40 am ఆంధ్రజ్యోతి

అమరావతి
ల్యాండ్‌ టైటిల్‌ బిల్లు 'రివర్స్‌'

రెండోసారీ తిప్పిపంపిన కేంద్రం.. విశేషాధికారాలు కుదరవని స్పష్టం

ట్రైబ్యునల్స్‌కు నియంత్రణ అధికారం వద్దు.. బిల్లుపై పలు అభ్యంతరాలు

తిరస్కరించిన తొలి బిల్లులోని అంశాలే రెండో బిల్లులో

అన్నీ తెలిసే పాత అంశాల కొనసాగింపు.. మళ్లీ అసెంబ్లీకే?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రతిష్టాత్మక చట్టాలకు సంబంధించిన బిల్లులను ఆమోదించడంలో కేంద్రం నుంచి ఒకసారి ఎదురు దెబ్బతగిలితే రాష్ట్ర ప్రభుత్వాలు అవమానకరంగా భావిస్తాయి. బిల్లుల రూపకల్పన, వాటి ఆమోదం కోసం జరిగిన అధికారిక కసరత్తు అంతా అభాసుపాలవుతుంది. దీని నుంచి బయటపడి మరోసారి బిల్లును రూపొందించి అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించాక.. మళ్లీ ల్యాండ్‌ టైటిల్‌ బిల్లు 'రివర్స్‌' ఎదురు దెబ్బ తగిలితే? అంతకు మించిన అవమానం ఉంటుందా? ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిల్‌ బిల్లు-2020(భూమి హక్కు) విషయంలో ఏపీ సర్కారుకు కేంద్రం నుంచి రెండోసారి కూడా శరాఘాతం ఎదురైంది.

గత ఏడాది డిసెంబరు 17న పంపించిన ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కొర్రీలు వేసింది. ఎనిమిది అంశాలపై అభ్యంతరాలు వ్యక్తంజేసింది. వాటిపై వివరణ ఇవ్వాలంటూనే, బిల్లులో ప్రస్తావించిన పలు అంశాలను మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సర్కారు ఇచ్చే వివరణలు సందేహాలను నివృత్తిచేయలేకపోవచ్చని, కేంద్ర సూచనల మేరకు కొత్తగా మరో బిల్లును రూపొందించుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే.. టైటిల్‌ బిల్లును మూడోసారి అసెంబ్లీకి పంపించాల్సి ఉంటుంది. ఈ పరిణామాలు ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోనే పేరొందిన సమర్ధ అధికార యంత్రాంగం, నిపుణులు, న్యాయకోవిదులు, లక్షలాది రూపాయల వేతనాలు తీసుకోనే సలహాదారులు, కేంద్రప్రభుత్వంలో తమకు అనుకూలంగా పనులు చేయించే ప్రభుత్వ ప్రతినిధులు ఎంతో మంది ఉన్నా.. రెండోసారి వెళ్లిన టైటిల్‌ బిల్లును కొర్రీలు లేకుండా ఆమోదింపచేసుకోలేకపోయారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లునే నమ్ముకొని ప్రారంభించిన 'భూముల సమగ్ర సర్వే' పరిస్థితి ఏమిటి? అన్న ఆందోళనా వ్యక్తమవుతోంది.

మొదటిసారి

ఏపీ సర్కారు 2019లోనే ల్యాండ్‌ టైటిల్‌ బిల్లును తీసుకొచ్చింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత కేంద్రం ఈ బిల్లును తిరస్కరించి గత నవంబరులో వెనక్కి పంపించింది. కేంద్ర రిజిస్ట్రేషన్‌ చట్టం-1908, కేంద్ర స్టాంప్స్‌ చట్టం-1899, కేంద్ర భూ సేకరణ, పరిహారం చట్టం-2013లోని అనేక అంశాలను ధిక్కరించేలా ఏపీ టైటిల్‌ బిల్లు ఉందని, వాటిని యథాతఽథంగా ఆమోదించడం కుదరదని కేంద్రం చెప్పింది. ఈ మేరకు బిల్లులోనుంచి ఎనిమిది అంశాలు తొలగించాలని సూచించింది. ఈ పరిణామంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. న్యాయ, రెవెన్యూ నిపుణులను సంప్రదించకుండా, కేవలం ఒకరిద్దరు జూనియర్‌ అధికారులతో బిల్లును రూపొందించడం వల్లే కేంద్రం నుంచి కొర్రీలుపడ్డాయన్న విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై నాడు సర్కారు స్పందించి విచారణ జరిపి బిల్లులోని లోపాలకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే, ఆ పనిచేయకుండానే రెండోసారి కొత్త బిల్లును రూపొందించారు.

రెండోసారి

మొదటిసారి పంపిన టైటిల్‌ బిల్లుపై కేంద్రం రెండోసారి ఎనిమిదికిపైగా అభ్యంతరాలను లేవనెత్తింది. బిల్లు నుంచి తొలగించాల్సిన అంశాలేమిటో సవివరంగా తెలిపింది. అవన్నీ ఫైల్‌లో ఉన్నాయి. రెండోసారి బిల్లు రూపొందించే సమయంలో ఇంతకు ముందు కేంద్రం ప్రస్తావించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మరోసారి చుక్కెదురుకాకుండా, కేంద్ర చట్టాలతో పోటీపడే, ధిక్కరించే అంశాలు లేకుండా బిల్లును తయారు చేయాలి. ఇది సమర్ధ అధికారుల బాధ్యత. ఈ నేపథ్యంలోనే గత ఏడాది డిసెంబరు 4న ఏపీ ల్యాండ్‌ టైటిల్‌ బిల్లు-2020ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారు. అదేనెల 17న కేంద్రానికి పంపించారు. ఆ తర్వాత 21న సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే ప్రారంభించారు. పక్షం రోజుల్లోగా టైటిల్‌ బిల్లు ఆమోదింపచేయాలంటూ అధికారులకు టార్గెట్‌ పెట్టారు. దీంతో కొందరు అధికారులు ఢిల్లీలో మకాం వేసి కేంద్రంతో సత్వర ఆమోదంకోసం శతవిధాల ప్రయత్నించారు.

నిబంధనల ప్రకారం బిల్లును అన్ని కోణాల్లోనూ పరిశీలించాకే మిగిలిన అంశాలు అంటూ కేంద్రం స్పష్టం చేసింది. సరిగ్గా, జనవరి 12న టైటిల్‌ బిల్లుపై కేంద్ర భూ వనరుల విభాగం అభ్యంతరాలు లేవనెత్తింది. ఆ తర్వాత కేంద్ర ఆర్థికశాఖ మరిన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చివరగా ఈ రెండు శాఖలు లేవనెత్తిన అభ్యంతరాలను ఉటంకిస్తూ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అసలు విషయం వెల్లడించింది. బిల్లులో ప్రస్తావించిన పలు అంశాలను సమ్మతించడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఆయా శాఖలు లేవనె త్తిన అభ్యంతరాలపై వచ్చి వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి కేంద్ర హోం మంత్రిత్వశాఖ లేఖ రాసింది.

తొలిసారివే రెండోసారి కూడా!

2019 టైటిల్‌ బిల్లుపై కేంద్రం అభ్యంతరాలు లేవనెత్తినప్పుడే అధికారులు, సర్కారు జాగ్రత్త వహించాల్సి ఉంది. మరోసారి సమస్య రాకుండా బిల్లును పక్కాగా రూపొందించాల్సి ఉంది. అయితే, కేంద్ర అభ్యంతరాలను పరిశీలిస్తే..ఇందులో అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొదటిసారి బిల్లుపై విబేధించిన పలు అంశాలను రెండోసారి బిల్లులోనూ ప్రస్తావించారు. విశేష అధికారాలు, సివిల్‌ కోర్టులు, కాలవ్యవధితో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలపై మొదటిసారే కేంద్రం అభ్యంతరాలు లేవనెత్తింది. అప్పుడే వాటిని బిల్లు నుంచి తొలగించాల్సి ఉంది. కానీ, వాటిని రెండోసారి బిల్లులోను కొనసాగించారు. ఇక కేంద్ర భూ సేకరణ చట్టం-2013, రిజిస్ట్రేషన్‌ చట్టం-1908లోని అనేక అంశాలను ధిక్కరించే క్లాజులను తొలగించమన్నా.. వాటినీ కొనసాగించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top