Friday, 30 Oct, 1.47 am ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
మా పద్ధతి మాదే..!

కేంద్ర వ్యవసాయ చట్టాలపై రాష్ట్రం

మార్కెట్‌ కమిటీల్లోనే కొనుగోళ్లు

1శాతం 'మార్కెట్‌ సెస్‌' వసూలు

వ్యాపారులకు లైసెన్సుల జారీ

రెన్యువల్‌కూ అవకాశం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): రైతాంగానికి ఇబ్బంది కలిగేలా ఉన్నాయంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను అమలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది. పంట ఉత్పత్తుల కొనుగోలు విషయంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డుల ప్రస్తుత విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని.. గతంలో మాదిరిగానే 'మార్కెట్‌ సెస్‌' కింద 'ఒక శాతం' కమీషన్‌ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయంచడం వెనుక ఉద్దేశం అదేనని స్పష్టమవుతోంది.

ఈ క్రమంలోనే ఏఎంసీల్లో పంట ఉత్పత్తులు కొనుగోలుచేసే వ్యాపారులకు ట్రేడ్‌ లైసెన్సులు జారీ చేయాలని, పాత వాటిని రెన్యువల్‌ చేసుకోవటానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో యాథావిధిగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.

ఆది నుంచీ సీఎం వ్యతిరేకమే..

కేంద్ర కొత్త వ్యవసాయ చట్టాలను సీఎం కేసీఆర్‌ ఆదినుంచీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంటులో కూడా టీఆర్‌ఎస్‌ ఎంపీలు వాటిని వ్యతిరేకించారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రానికి సదరు చట్టాల ప్రతులను కేంద్రం పంపింది. అమలు జరుగుతున్న తీరుపై నివేదిక కోరింది. ఆ చట్టాలపై అధ్యయనం చేసిన రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ.. ఓ నివేదికను సెప్టెంబర్‌ నెలాఖరులో రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.

సీఎం కార్యాలయం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోయినప్పటికీ.. పలువురు మంత్రులు బహిరంగ సమావేశాల్లో 'వ్యవసాయ చట్టాలు అమలు చేయబోం!' అని చెబుతూనే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో వరంగల్‌, ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డుల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా గురువారం ప్రారంభమయ్యాయి. మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తుల కొనుగోళ్లు వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో యథాతథంగా కొనసాగుతున్నాయి.

'సెస్‌' యథాతథం

గతంలో ఉన్న నిబంధనల ప్రకారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో (ఏఎంసీ) లేదా మార్కెట్‌ బయట లావాదేవీలు జరిగితే 'మార్కెట్‌ సెస్‌' కింద ఒక శాతం ఫీజు వసూలు చేసేవారు. మార్కెటింగ్‌ శాఖ నుంచి లైసెన్సులు పొందిన ట్రేడర్లు మాత్రమే పంట ఉత్పత్తుల కొనుగోలు చేయాలనే నిబంధన ఉండేది. దళారుల సమస్య ఉన్నప్పటికీ.. మార్గదర్శకాలు ఉండటంతో ట్రేడర్ల వ్యవస్థ పూర్తిగా మార్కెటింగ్‌ శాఖ నియంత్రణలో ఉండేది.

కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ప్రకారం.. మార్కెట్‌ కమిటీల వెలుపల జరిగే అమ్మకాలు, కొనుగోళ్లపై మార్కెటింగ్‌ శాఖకు నియంత్రణ ఉండదు. 'సెస్‌' వసూలు విధానం లేదు. దీంతో ఏఎంసీల ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం.. గతంలో మాదిరిగానే సెస్‌ వసూలు చేయాలని నిర్ణయించింది. అయితే, మార్కెట్ల బయట జరిగే క్రయవిక్రయాలను ప్రభుత్వం పట్టించుకోదు.

మద్దతు ధర ఇవ్వకపోతే..

ప్రైవేటు ట్రేడర్లు మద్దతు ధర ఇవ్వకపోతే మాత్రం రంగంలోకి దిగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు తాజాగా జరిగిన మొక్కజొన్నల వ్యవహారమే నిదర్శనం.మొక్కజొన్నలకు ఎమ్మెస్పీ ఽరూ.1,850 ఉంటే.. ట్రేడర్లు రూ.1,150-1,250 చొప్పున కొనుగోలు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది.

అప్పుడు మార్కెట్‌ దారిలో పడింది. ట్రేడర్లు ధరలు పెంచారు. కేంద్ర ప్రభుత్వ చట్టాల్లో సమస్యలకు ఏ పరిష్కారమూ చూపలేదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 'ఆంధ్రజ్యోతి'తో అన్నారు.

సీఎం నిర్ణయమే కీలకం..

ఈ చట్టాల అమలు విషయంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయమే కీలకం. వాటిని ఆయన వ్యతిరేకిస్తున్నా.. ఎలాంటి స్పష్టమైన ప్రకటనా ఇంత వరకూ వెలువడలేదు. ఈ చట్టాల అమలుకు వీలుగా 'రాష్ట్ర గెజిట్‌'లో ప్రభుత్వం నోటిఫై చేయాల్సి ఉంటుంది. కానీ ఇంతవరకు అదీ జరగలేదు.

ఆ అధికారం రాష్ట్రాలకు లేదు..

భారత రాజ్యాంగం ప్రకారం.. పార్లమెంటు ఒక చట్టాన్ని తీసుకొస్తే అది దేశ వ్యాప్తంగా అమలులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలపై, అదే సబ్జెక్టు మీద శాసనాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఒకవేళ చేస్తే వాటిని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదించాల్సిందే. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర చట్టాలను అమలు చేయకపోతే ఆర్టికల్‌- 256 కింద డైరెక్షన్‌ ఇచ్చే అధికారం కేంద్రానికి ఉంది.

ఒకవేళ దానినీ పట్టించుకోకపోతే..'కానిస్టిట్యూషనల్‌ బ్రేక్‌డౌన్‌' అంటారు. అప్పుడు రాష్ట్రపతి పాలన విఽధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోర్టును ఆశ్రయించినా.. ఉపయోగం ఉండకపోవచ్చు. చట్టాల అమలు విషయంలో రాష్ట్రాలకు పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి. కేంద్రానికి చాలా ఎక్కువ అధికారాలుంటాయి. అయితే, ఉమ్మడి జాబితా(ఎంట్రీ 30) కింద సదరు చట్టాలను అమలు చేయలేమని భావిస్తే.. ఆర్టికిల్‌- 131 కింద కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం 'సూట్‌' వేసుకుకోవచ్చు.

- కె.రామకృష్ణారెడ్డి, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌, హైదరాబాద్‌

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top