Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్ మృతి..

మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్ మృతి..

ఢిల్లీ, జూన్ 05: లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సుభాష్‌ సి కశ్యప్‌(97) కన్నుమూశారు. గురువారం ఉదయం 10 గంటలకు సైనిక్‌ఫామ్‌లో ఉన్న తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు.

ఈ విషయాన్ని లోక్‌సభ సెక్రటేరియట్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆయన దీర్ఘకాలంగా తీవ్ర అనారోగ్యంతో, ఊపిరితుత్తుల సమస్యతో బాధపడుతున్నారు. జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సారథ్యంలో ఏర్పాటైన కమిటీలో కశ్యప్‌ సభ్యునిగా ఉన్నారు.

100కు పైగా పుస్తకాలు రచించి ప్రముఖ రచయితగా పేరుగాంచిన కశ్యప్.. 1983 నుంచి 1990 వరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా సేవలందించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ కాలంలో కొలువుతీరిన తొలి లోక్‌సభ మొదలు 9వ లోక్‌సభాకాలం దాకా మొత్తంగా 37 ఏళ్లపాటు పార్లమెంట్‌లో పనిచేసి రాజ్యాంగం సంబంధ విషయాలపై కశ్యప్‌ అసాధారణ పట్టుసాధించారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న యునైటెడ్‌ ప్రావిన్స్‌(ప్రస్తుత ఉత్తర్ ప్రదేశ్‌)లో 1929లో బిజ్నోర్‌ పరిధిలోని ఛాద్‌పూర్‌ గ్రామంలో కశ్యప్‌ జన్మించారు.

కశ్యప్.. తన తండ్రి, తాతల మాదిరిగా యుక్త వయస్సులోనే దేశస్వాతంత్య్రం కోసం పోరాటం ఆరంభించారు. అలహాబాద్‌, న్యూఢిల్లీ, వాషింగ్టన్‌ డీసీ, లండన్, జెనీవా నగరాల్లోని వివిధ విద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. అలహాబాద్‌ వర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసి.. తర్వాత అలహాబాద్‌ హైకోర్టులో న్యాయవాదిగా శిక్షణ పొందారు. చివరకు పార్లమెంట్‌లో ఉద్యోగంలో చేరారు. కశ్యప్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

కశ్యప్ భారతదేశంలోని అగ్రశ్రేణి రాజ్యాంగ పండితులలో ఒకరని, పార్లమెంటరీ, రాజ్యాంగ సంబంధమైన చర్చలకు ఆయన చేసిన కృషి మన సమాజాన్ని సుసంపన్నం చేసిందని ప్రధాని పేర్కొన్నారు. అలానే కశ్యప్ మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కశ్యప్ సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం గతంలో ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆయనకు ఎన్నో గౌరవ డాక్టరేట్లు వరించాయి. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy