Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మానని గాయాలతో ముప్పు

మానని గాయాలతో ముప్పు

  • పెరుగుతున్న వాస్కులర్‌ డిసీజ్‌ సమస్యలు

  • ధమనులు, సిరల్లో రక్తప్రసరణకు సంబంధించిన వ్యాధులే

  • మధుమేహ బాధితుల్లో అధిక మంది వారే

  • నేడు జాతీయ వాస్కులర్‌ డే

హైదరాబాద్‌ సిటీ: మధుమేహం కారణంగా ప్రతీ ఏడాది సుమారు లక్షమంది కాలు తొలగించుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. మధుమేహ రోగుల్లో ప్రతీ నలుగురిలో ఒకరికి జీవితకాలంలో ఒకసారి అయినా పాద పుండు (ఫుట్‌ అల్సర్‌) వచ్చే అవకాశం ఉందన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ ఉన్న, ధూమపానం చేసే, 50 ఏళ్లకు మించిన వారు వాస్కులర్‌ వ్యాధులకు ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉందన్నారు.

దేశంలో పెరుగుతున్న మధుమేహం కారణంగా రక్తనాళాల వ్యాధులు (వాస్కులర్‌ డిసీజెస్‌) ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్కులర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా గణాంకాల ప్రకారం.. దేశంలో వాస్కులర్‌ వ్యాధులపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉంది. ప్రారంభ దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే వికలాంగత్వం, అవయవాల తొలగింపు వంటి సమస్యలను చాలా వరకు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తొలి హెచ్చరిక ఇలా..

నడిచేటప్పుడు వచ్చే కాళ్ల నొప్పిని చాలా మంది వయస్సు పెరిగిన కారణంగా భావిస్తారు. కానీ అది కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు మూసుకుపోతున్న తొలి హెచ్చరిక కావచ్చునని వైద్యులు వివరించారు. కాళ్ల వాపు, పాదాలు చల్లబడటం, మానని గాయాలను నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు.

 వాస్కులర్‌ వ్యాధులంటే..

శరీరంలోని ధమనులు, సిరల్లో రక్తప్రసరణకు సంబంధించిన వ్యాధులను వాస్కులర్‌ వ్యాధులు అంటారని వైద్యలు తెలిపారు. నడిచేటప్పుడు కాళ్ల నొప్పి, కాళ్ల వాపు, పాదాల్లో తిమ్మిరి, మానని పాద గాయాలు వంటి ప్రారంభ లక్షణాలను చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. దీంతో వ్యాధి తీవ్రమైన దశకు చేరుకున్న తర్వాత గుర్తించే పరిస్థితి ఏర్పడుతోందని వైద్యులు వివరించారు.

పరీక్ష

డాప్లర్‌ పరీక్ష ద్వారా ధమనులు, సిరల్లో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుందా లేదా, ఎక్కడైనా అడ్డంకులు, ఇరుకుదనం ఉందనే విషయాన్ని గుర్తించవచ్చన్నారు.

మధుమేహం ఎఫెక్ట్‌

భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహంతో బాధపడుతుండగా, వీరిలో చాలామందికి కాళ్లలో రక్తప్రసరణ తగ్గి పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌ (పీఏడీ) వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. కాళ్లలో ధమనులు మూసుకుపోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. రక్తనాళాల వ్యాధులకు ప్రధాన కారణం మధుమేహం, ధూమపానం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ అన్నారు.

పరీక్షలతో వ్యాధిని గుర్తించవచ్చు

సాధారణ వాస్కులర్‌ పరీక్షలు, డాప్లర్‌ స్కాన్‌ ద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు. నడిచేటప్పుడు కాళ్ల నొప్పి, తిమ్మిరి, కాళ్లలో నిరంతర వాపు, వెరికోస్‌ వెయిన్స్‌, పాదాలు చల్లబడటం, మొద్దుబారడం, కాళ్లు, పాదాల రంగు మారడం, మానని గాయాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రక్తనాళాల వ్యాధులపై అవగాహనతో పాటు ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా కాళ్లను కోల్పోయే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

  • డాక్టర్‌ పీసీ గుప్తా, వాస్కులర్‌ సర్జన్‌, కేర్‌ ఆస్పత్రి

ఈ వార్తలు కూడా చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy