తెలంగాణ తాజావార్తలు
మార్కులు లేని ఇంటర్ మెమో..ఆందోళనకు గురైన విద్యార్థిని

ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు స్పందించాలని వేడుకోలు
కుంటాల, జనవరి 21: మార్కులు లేని ఇంటర్ మెమో రావడంతో.. ఓ విద్యార్థిని తీవ్ర ఆందోళనకు గురైన సంఘటన నిర్మల్ జిల్లా కుంటాలలో గురువారం చోటు చేసుకుంది. లోకేశ్వరం మండలం గొడిసెర గ్రామానికి చెందిన దోమకొండ శ్రావణి కుంటాలలోని ఆదర్శ మోడల్ పాఠశాలలో ఇంటర్మీడియట్ (బైపీసీ) ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుంది. గతంలో విడుదలైన ఫలితాల్లో ఆమె ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణురాలైంది. డిగ్రీలో ప్రవేశం కోసం నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలో షార్ట్ మెమోతో దరఖాస్తు చేసుకుంది. అయితే ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఒరిజినల్ మెమోలో తెలుగు, ఇంగ్లీష్, బోటనీ సబ్జెక్టుల మార్కులు లేకపోవడంతో.. శ్రావణి ఆందోళనకు గురైంది. ఇంటర్ బోర్డు అధికారులు స్పందించి.. తక్షణమే మార్కులతో ఉన్న మెమో ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.