Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మధ్య ఆసియాకు మరింత దగ్గరవుదాం

మధ్య ఆసియాకు మరింత దగ్గరవుదాం

  • ఉజ్బెకిస్థాన్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌ దేశాల పర్యటన ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ వ్యాఖ్య

న్యూఢిల్లీ, ఆగస్టు 29: మధ్య ఆసియా దేశాలైన ఉజ్బెకిస్థాన్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌లలో నాలుగు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ శనివారం బయలుదేరి వెళ్లారు.

శని, ఆదివారాల్లో ఉజ్బెకిస్థాన్‌లో పర్యటించనున్న మోదీ.. ఆ దేశాధ్యక్షుడు షౌకత్‌ మీర్జాయోయెవ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం ఈ నెల 31, వచ్చే నెల 1వ తేదీల్లో కిర్గిజ్‌ రిపబ్లిక్‌లో పర్యటిస్తారు. బిష్కెక్‌లో జరిగే 26వ షాంఘై సహకార సమాఖ్య (ఎస్‌సీవో) శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొని ప్రసంగిస్తారు.

కిర్గిజ్‌ అధ్యక్షుడు సదిర్‌ ఝపరోవ్‌తో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పర్యటనకు బయలుదేరే ముందు మోదీ.. తన పర్యటన వివరాలను వెల్లడించారు. రెండు దేశాల అధ్యక్షుల ఆహ్వానం మేరకు ఆయా దేశాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు.

మధ్య, దక్షిణాసియాను ఉగ్రవాద రహిత ప్రాంతంగా మార్చేందుకు ఆయా దేశాధినేతలతో చర్చలు జరపనున్నట్లు చెప్పారు. మధ్య ఆసియాతో భారత్‌కు ఉన్న సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని వెల్లడించారు. తాష్కెంట్‌లోని 'శాస్త్రి మెమోరియల్‌'తోపాటు తాష్కెంట్‌ స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఓరియంటల్‌ స్టడీస్‌లో మహాత్మాగాంధీ సెంటర్‌ను సందర్శించనున్నట్లు తెలిపారు. మధ్య ఆసియా దేశాలైన ఉజ్బెకిస్థాన్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌, తుర్క్‌మెనిస్థాన్‌, తజకిస్థాన్‌, కజికిస్థాన్‌లలో మోదీ తొలిసారి 2015 జూలైలో పర్యటించారు. సహజవాయువు, యురేనియం, బంగారం, సీసం తదితర సహజ సంపదలకు నెలవైన ఈ దేశాలకు చైనా దగ్గరవుతోంది. ఆయా దేశాల్లో వేలకోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఆ దేశం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌లో ఈ దేశాలను భాగస్వాములను చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy