Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహారాజా టీ20 టోర్నీ: వేలంలో కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్!

మహారాజా టీ20 టోర్నీ: వేలంలో కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్!

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పేరు వినగానే కోట్ల రూపాయల బిడ్లు గుర్తొస్తాయి. ఐపీఎల్ 2026 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అతడిని రూ.14 కోట్లకు సొంతం చేసుకుంది.

ఈ సీజన్‌లో 14 మ్యాచుల్లో 593 పరుగులతో రాహుల్ సత్తా చాటాడు. పంజాబ్ కింగ్స్‌పై ఏకంగా 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇంతటి విధ్వంసకర బ్యాటర్ ఫ్రాంచైజీ క్రికెట్‌లో వేలంలోకి వస్తే పోటీపడి మరీ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ తాజాగా జరిగిన ఓ వేలంలో పరిస్థితి భిన్నంగా కనిపించింది. రూ.2లక్షలకు కూడా ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. మరి అతడు ఏ వేలంగా అమ్ముడుపోలేదంటే..

కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతి ఏటా మహారాజా టీ20 పేరిట లీగ్ నిర్వహిస్తుంటుంది. ఈ లీగ్‌లో 2026 సీజన్‌కు సంబంధించి బెంగళూరులో శుక్రవారం వేలం జరిగింది. దీంట్లో భాగంగా కేఎల్ రాహుల్ పేరు ఆక్షన్‌లోకి వచ్చింది. రూ.2 లక్షల బెస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతడిని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.

కారణం అదేనా..?

అయితే ఇందుకు కారణం రాహుల్‌పై ఆసక్తి లేకపోవడం కాదు. వేలం సమయంలో పలు ఫ్రాంచైజీలు టోర్నీ సమయానికి రాహుల్ అందుబాటులో ఉంటాడా? అని ప్రశ్నించాయి. ఈ సీజన్‌కు అతడు అందుబాటులో ఉండకపోవచ్చని వేలం నిర్వాహకులు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో జట్లు బిడ్ వేయడానికి వెనుకంజ వేశాయి. జూన్, జులై నెలల్లో భారత జట్టు తరఫున రాహుల్ బిజీగా ఉండనున్నాడు. జూన్ 20న అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడో వన్డేలో అతడు ఆడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టుతో చేరనున్నాడు. దీంతో మహారాజా ట్రోఫీలో అతడు పాల్గొనడం అనుమానంగా మారింది.

మహారాజా టోర్నీ జూన్ 20 నుంచి జులై 12 వరకు కొనసాగనుంది. ఈ మధ్యలో ఐర్లాండ్‌తో రెండు టీ20లు(జూన్ 26-28), ఇంగ్లండ్‌తో(జులై 1 నుంచి 10 వరకు) ఐదు టీ20 మ్యాచుల్లో భారత్ తలపడనుంది. ఇదిలా ఉంటే, కర్ణాటక సీనియర్ ఆటగాళ్లు కరుణ్ నాయర్, మనీశ్ పాండేకు భారీ బిడ్లు దక్కాయి. మంగళూరు డ్రాగన్స్ ఫ్రాంచైజీ కరుణ్ నాయర్‌ను రూ.18 లక్షలకు కొనుగోలు చేయగా, గుల్‌బర్గా మిస్టిక్స్ మనీశ్ పాండే కోసం రూ.12.75 లక్షలు వెచ్చించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy