Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్.. సిట్ ఏర్పాటుకు సీఎం ఆదేశం

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్.. సిట్ ఏర్పాటుకు సీఎం ఆదేశం

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర టీచర్ అర్హత పరీక్షకు (టెట్) సరిగ్గా ఒక రోజు ముందు ప్రశ్నపత్రం లీక్ కావడంతో టెట్ వాయిదా పడింది. ఇందుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఘటనపై లోతైన దర్యాప్తు కోసం సీఎం ఫడణవీస్ సిట్ ఏర్పాటుకు ఆదేశించారు. జాయింట్ సీపీ ఆధ్వర్యంలో ఈ సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఉదంతంపై సీఎం ఫడణవీస్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే, డీజీపీలతో చర్చించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ కేసుకు సంబంధించి భివండీ పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు బిహార్, హర్యానాలకు చెందిన వారని గుర్తించారు. టెట్ ప్రశ్నలున్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రశ్న పత్రం లీక్‌కు సంబంధించిన సమాచారం తొలుత జోన్-2 డీసీపీ పవన్ బాన్సోద్‌కు అందిందని థానే అడిషనల్ కమిషనర్ అశోక్ ధూదే తెలిపారు. ప్రశ్న పత్రాలు విక్రయించేందుకు నిందితులు భివండీ వస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు వలపన్ని వారిని అరెస్టు చేసినట్టు చెప్పారు. వారి వద్ద నుంచి పలు ఫోన్లు, క్రెడిట్, డెబిట్ కార్డులు, నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వారి వద్ద లభించిన పత్రాలను విద్యాశాఖ సీనియర్ అధికారులు పరిశీలించారని చెప్పారు. అవి అసలు ప్రశ్న పత్రాల నకళ్లేనని వారు ధ్రువీకరించారని అన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ టెట్-2026ను వాయిదా వేశామని ప్రకటించింది.

ఈ వార్తలనూ చదవండి:

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు.. మరో చార్జ్ షీటు దాఖలు చేసిన ఎన్‌ఐఏ

భారత్, పాక్ మధ్య దౌత్యం.. తెర వెనుక చర్చలు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy