తెలంగాణ తాజావార్తలు
మహిళల రక్షణకు డ్రోన్ కెమెరాలు

హైదరాబాద్: దేశంలోనే నెంబర్‌వన్ పోలీసుగా పేరొందిన తెలంగాణ పోలీసులు క్నాలజీ వినియోగంలో విప్లవాత్మకమైన చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు డ్రోన్ కెమెరాలను పోలీసులు సిద్ధం చేశారు. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు పోలీసు యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కమాండ్ కంట్రోల్ ప్రారంభ సందర్భంగా ఐ డ్రోన్ కెమెరా, 100 నెంబర్ సర్వీస్‌ను మొదలు పెడదామని డీజీపీని కేటీఆర్ కోరారు. మహిళలకు రక్షణ కోసం టెక్నాలజీని వాడుకోవాలని కేటీఆర్ తెలిపారు. అందరి ఫోన్లలో కామన్‌గా ఉండే బటన్ నొక్కగానే దగ్గరలో ఉన్నపోలీస్ స్టేషన్ నుంచి కెమెరాతో ఉన్న డ్రోన్ ఘటన స్థలానికి వెళుతుందని అని ఓ సందర్భంలో కేటీఆర్ తెలిపారు.
పోలీసు అధికారులు మొదట హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్లను వినియోగించాలని నిర్ణయించారు. ఇప్పటికే టెస్ట్ డ్రైవ్ ప్రారంభించినట్టు సమాచారం. అత్యాధునిక కెమరాలు, లైటింగ్, స్పీకర్లతో జీపీఎస్ ఆధారంగా పనిచేసే ఈ డ్రోన్లు క్షేత్రస్థాయి పరిస్థితులను క్షణాల్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరవేయగలవు.
ఎవరైనా మహిళ ఆపదలో ఉండి ఎస్‌ఓఎస్ బటన్ నొక్కితే సమాచారం అందుకున్న వెంటనే ఆ ప్రదేశానికి డ్రోన్లను పంపి డ్రోన్ కెమెరాల ద్వారా నేరస్థుల కదలికలపై నిఘా పెట్టవచ్చు. పోలీస్ సైరన్‌తో డ్రోన్ కనిపిస్తే నేరస్థులను కట్టడి చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఎక్కడ ఏ నేరం, ప్రమాదం జరిగినా ఆకాశంలో వెంటనే పోలీస్ సైరన్ మోగనున్నది.
ప్రతి డ్రోన్‌కు పోలీస్ సైరన్, ప్రత్యేక లైట్లు, అత్యాధునిక కెమెరాలను అమరుస్తారు. లొకేషన్ సమాచారం అందగానే జీపీఎస్ సాహయంతో అక్కడికి నిమిషాల్లో చేరిపోయే విధంగా ఆటోమెటిక్‌గా పనిచేస్తాయి. ఒక్కో డ్రోన్ మూడు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తుంది. పగలు, రాత్రివేళల్లో కెమెరాల సామర్థ్యం, క్రైం స్పాట్‌కు చేరడంలో డ్రోన్లకు ఎదురవుతున్న అవరోధాలు, స్పాట్‌లోని వ్యక్తులకు పోలీసులు ఇచ్చే సూచనలు వినిపించేలా స్పీకర్ల సామర్థ్యాన్ని పెంచడం తదితర అంశాలను పరీక్షిస్తున్నారు.
ఆకతాయిలు డ్రోన్లను రాళ్లతో కొట్టి పాడు చేయకుండా వాటిని ఎంత ఎత్తులో ఆపరేట్ చేయాలన్న అంశాలను కూడా అధ్యయనం చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే DGCI అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఏదైనా ప్రమాదం జరిగినా, నేరం జరిగినా డయల్ 100కి కానీ, హాక్‌ఐ లేదా మరే రూపంలోనైనా పోలీసులకు సమాచారం చేరితే వెంటనే ఆ ప్రదేశానికి సంబందించిన లొకేషన్ ద్వారా ఈ డ్రోన్ వెళ్లే విధంగా నూతన టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు. గాలిలో వెళ్లే డ్రోన్లు ఎలాంటి అవరోధాలు లేకుండా ఘటనా స్థలానికి చేరతాయి. ఘటనా స్థలంలో పరిస్థితిని వీడియోలు, ఫొటోల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు క్షణాల్లో చేరవేస్తాయి. దీంతో సిబ్బందిని అప్రమత్తం చేసే వీలు కలుగుతుంది.
డ్రోన్లకు ఉండే పోలీస్ సైరన్‌తో నేరస్తుడికి పోలీసులు వస్తున్నారన్న భయం కలుగుతుంది. బాధితులకు ధైర్యం వస్తుంది. స్పీకర్ల ద్వారా పోలీసులు నేరుగా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పవచ్చు. క్రైం సీన్‌ను బట్టి అంబులెన్స్, ఫైర్ తదితర విభాగాలను అలర్ట్ చేసే వీలుంటుంది.