ఘనవ్యర్థాల నిర్వహణపై అధ్యయనం
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఘన వ్యర్థాల సమర్థ నిర్వహణపై అధ్యయనానికి మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ రెండు రోజుల పర్యటన నిమిత్తం మలేషియా చేరుకున్నారు.
ఆయనకు కౌలాలంపూర్‌లోని భారత్ హైకమిషన్ కార్యాలయంలో అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మలేషియాలోని క్లాంగ్ పార్లమెంట్ సభ్యుడు గణపతిరావు, మంత్రి పప్పారాయుడు మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. అనంతరం మలేషియాలో ఘన వ్యర్థాల నిర్వహణ రంగంలో అమలవుతున్న ఆధునిక విధానాల అధ్యయనాన్ని మంత్రి ప్రారంభించారు. సెలంగార్ రాష్ట్రంలోని కేడీఈబీ వేస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థ కార్యాలయంలో నారాయణకు అక్కడి అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. మధ్యాహ్నం పలు వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను సందర్శించారు. ఆయన వెంట ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ తదితరులున్నారు.

