ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమబెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2013లో పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్‌లో నమోదైన కేసుకు సంబంధించి విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని కోరుతూ..
ఈ నోటీసులు అందజేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్‌పీసీ) సెక్షన్ 160 కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. విచారణాధికారిని ఎప్పుడు, ఎక్కడ కలవాలన్నది ఆమె సౌకర్యానుసారం నిర్ణయించుకోవచ్చని సూచించారు.
అసలేం జరిగిందంటే?
2013లో ఢిల్లీలోని నాటి ప్రణాళికా సంఘం కార్యాలయం సమీపంలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆ సమయంలో మమత తన పార్టీ నేతలు, మంత్రులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ఆమె బృందాన్ని చుట్టుముట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. అప్పటి బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రాపై దాడి చేసి, దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రాగా.. ఈ ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్‌లో కేసు నమోదైంది. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, ఉద్యోగులపై దాడి చేయడం, అల్లర్లు సృష్టించడం వంటి అభియోగాలతో ఐపీసీ సెక్షన్లు 186, 353, 332, 147, 149, 34 కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో నాటి ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి రితబ్రత బెనర్జీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే.. ఈ కేసులో మమత పాత్రపై మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాలని భావిస్తున్నారు. కేసుకు సంబంధించిన పరిస్థితులపై ఆమెకు అవగాహన ఉందని, అందుకే సాక్షిగా విచారణకు సహకరించాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులపై మమత లేదా టీఎంసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

