-పచ్చిగడ్డి పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం
-రైతులకు రూ.14వేల ఆర్థికసాయం
నెన్నెల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో నేపథ్యంలో రాబోయే వేసవికాలంలో పశుగ్రాసం కొరత రాకుండా ఉండేందుకు పశుసంవర్థకశాఖ చర్యలు చేపడుతోంది.
వ్యక్తిగత పశుగ్రాస అభివృద్ధి కార్యక్రమాన్ని(ఐఎఫ్‌డీ) అమలుచేస్తోంది. పచ్చిగడ్డి పెంపకానికి ప్రోత్సాహ కంగా వీబీ జీరామ్‌జీ ద్వారా రూ.14వేలు అందజేస్తోంది. కరువుకాలంలో పశు పెంపకం దారులు, రైతులకు ఈ పథకం ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని అధికారులంటున్నారు. పశువులతోపాటు జాబ్‌కార్డు కలిగి ఉన్న రైతులకు సాయం అందుతుంది. పశుసంవర్థక శాఖ, వీబీజీరామ్‌జీ అధికారులు సమన్వయంతో పశుగ్రాసం పెంచేందుకు రైతులకు తోడ్పాటును అందిస్తారు.
-విత్తనం నుంచి కటింగ్ వరకు..
నీటిసౌకర్యం ఉన్న రైతులు తమకున్న ఒకఎకరం భూమిలో పశుగ్రాసాన్ని సాగు చేసుకోవచ్చు. పశువైద్యాధికారిని సంప్రదిస్తే రైతుకున్న పశువుల సంఖ్యను ధ్రువీకరిస్తారు. స్థానిక గ్రామపంచాయతీ ద్వారా తీర్మాణం తీసుకొని వీబీ జీరామ్‌జీ అధికారులకు అందజేస్తే వారు ప్రతిపాదనలు తయారు చేస్తారు. ఉత్తర్వుల అనంతరం విత్తనాలు అందజేయడం నుంచి గ్రాసం కటింగ్ వరకు దశల వారీగా రైతు ఖాతాలో డబ్బులు జమచేస్తారు. వచ్చిన గడ్డిని కోసుకుంటూ పశువులకు వేసవికాలంలో సైతం పచ్చిగడ్డి మేపుకోవచ్చు.
- సద్వినియోగం చేసుకోవాలి
ఎల్‌నినో ప్రభావం నుంచి పశువులను గట్టెక్కించేందుకు ప్రభుత్వం పశుగ్రాస పెంపకానికి ఆర్థిక సాయం చేసి ప్రోత్సహిస్తోంది. ఇందుకుగాను పశుగ్రాస అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. పచ్చిగడ్డి సాగుచేసే రైతులకు విత్తనాల ఖర్చు, కంచె ఏర్పాటు, ఎరువులు, కోత కూలీలు, నీటిపారుదల తదితరాల కోసం ప్రభుత్వం రూ.14వేల ఆర్థికసాయం చేస్తుంది. నేపియర్ గడ్డి, మక్క, జొన్న, గినియా లాంటి పచ్చి గ్రాసాలను రైతులు సాగు చేసుకోవచ్చు. పశుపెంపకందారులు, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

