మెక్సికో, మే 18: మెక్సికోలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ప్యూబ్లా రాష్ట్రంలోని తెహ్‌విట్టింగ్‌లో ఆదివారం ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మరణించారు.
మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలతోపాటు ఒక చిన్నారి ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఒక మహిళ తీవ్రంగా గాయపడడంతో.. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిందని తెలిపారు. ఈ కాల్పుల వెనుక ఉద్దేశ్యం ఏమిటనేది తెలియలేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. ఈ ఏడాదిలో ఇది మూడో కాల్పుల ఘటన అని పోలీసులు గుర్తు చేశారు. ఫిబ్రవరిలో హహ ఎలాన్ ఎల్ గ్రాండే నగరంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు.
కొన్ని రోజుల అనంతరం ప్యూబ్లా రాజధానిలో వాహనంపై దాడిలో మరో ముగ్గురు మరణించారు. మధ్య మెక్సికోలో హింస రోజురోజుకు పెచ్చరిల్లుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు 1000 కుటుంబాలు ఈ ప్రాంతాన్ని వీడి మరో ప్రాంతానికి తరలి వెళ్లాయి. మరోవైపు మరికొద్ది రోజుల్లో మెక్సికో దేశం ఫిఫా ప్రపంచ కప్‌కు సహ ఆతిథ్యం ఇవ్వనుంది. అలాంటి తరుణంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకోవడం పట్ల సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ కాల్పుల ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం ప్రకటించింది.

