Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెటాపై కేసు నమోదు చేసిన ఆ డీసీపీని.. రేవంత్‌రెడ్డి బదిలీ చేశారు: కిషన్‌రెడ్డి

మెటాపై కేసు నమోదు చేసిన ఆ డీసీపీని.. రేవంత్‌రెడ్డి బదిలీ చేశారు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేయడం రాజ్యాంగ హక్కు అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు.

మెటాపై కేసు నమోదు చేసిన డీసీపీ ఆనంద్ బాబుని తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసిందని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం పని చేసిన ఆ అధికారిని సీఎం రేవంత్‌రెడ్డి శిక్షించారని తెలిపారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రేవంత్‌రెడ్డి ఆ డీసీపీని ట్రాన్స్‌ఫర్ చేశారని ఆరోపించారు. చట్టప్రకారం నడిచే అధికారులపై సీఎం వేటు వేస్తున్నారని ధ్వజమెత్తారు.

సోషల్ మీడియా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి..

గత కేసీఆర్ ప్రభుత్వం ఫోన్‌ట్యాపింగ్ చేసి అధికార దుర్వినియోగం చేసిందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అదే తరహాలో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై సోషల్ మీడియా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మద్దతుతో ఉన్న టీవీకే ప్రభుత్వంలో... సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేశారని తెలిపారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కేసులు నమోదు చేసిన అధికారులను శిక్షిస్తోందని అన్నారు. రేపు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూడా ఇలానే వదిలేస్తారా..? అని ప్రశ్నించారు.

సింగరేణికి మూడు కోల్‌ బ్లాక్‌లు కేటాయించాం..

సింగరేణికి మూడు కోల్‌ బ్లాక్‌లు కేటాయించామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మణుగూరు PKOC బ్లాక్‌ను సింగరేణికి కేటాయించామని ప్రకటించారు. వేలంలో పాల్గొనేందుకు అనేకమంది ముందుకొచ్చారు కానీ.. సింగరేణి కష్టాలను దృష్టిలో ఉంచుకునే కేటాయించినట్లు వివరించారు. నైనీ, తాడిచర్ల బ్లాక్‌-2, మణుగూరు PKOC బ్లాక్‌లను.. సింగరేణికి కేటాయించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. కొత్త బ్లాక్‌ల కేటాయింపుతో సింగరేణికి కొత్త ఆశలు వస్తాయని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ సింగరేణిని దోచుకున్నాయని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

వార్తలు కూడా చదవండి...

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy