Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీ పోరాటాలు ప్రశంసనీయం

మీ పోరాటాలు ప్రశంసనీయం

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ ప్రశంస

  • రాష్ట్రంలో కాంగ్రెస్‌ నియంతృత్వ పాలనకు గుణపాఠం తప్పదని 'ఎక్స్‌'లో పోస్టు

  • రాంచందర్‌రావు అరెస్టును ఖండించిన బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి, ఎంపీలు

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ రాష్ట్ర శాఖ పోరాటాలు ప్రశంసనీయమని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ అన్నారు. 'సడక్‌ సే సదన్‌ తక్‌' అంటూ కాంగ్రె్‌సపై పోరాటాలను కొనసాగించాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ నేతలపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడిపై ఆరా తీశారు. మంగళవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావుకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. గడచిన రెండు రోజులుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలను రాంచందర్‌రావు ఆయనకు వివరించారు. 1,000 రోజుల పాలన వైఫల్యాలను ఎండగడుతున్నామన్న అక్కసుతోనే కాంగ్రెస్‌ దాడులకు పాల్పడిందన్నారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందని నితిన్‌ నబిన్‌ ధ్వజమెత్తారు. రాంచందర్‌రావుతో మాట్లాడిన అనంతరం ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. రాహుల్‌ గాంధీ రాజ్యాంగం గురించి మాట్లాడే నీతులన్నీ నాటకాలేనని విమర్శించారు. ఇటీవల కాంగ్రెస్‌ గూండాల దాడికి గురైన బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిని పరామర్శించేందుకు వెళ్తున్న రాంచందర్‌రావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నియంతృత్వ పాలనకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఇదిలా ఉండగా, రాంచందర్‌రావు అరెస్టును కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఖండించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందన్నారు. కాంగ్రెస్‌ సర్కారు ప్రజల హక్కులను కాలరాస్తూ, తన అసమర్థతను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను అక్రమంగా నిర్బంధిస్తోందని కేంద్ర మంత్రి జీ కిషన్‌ రెడ్డి విమర్శించారు. రామచందర్‌రావును హౌస్‌ అరెస్ట్‌ చేయడం ప్రభుత్వ భయానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని ఎంపీ ఈటల రాజేందర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్బంధ విధానాలు అవలంబిస్తోందని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. కొంతమంది పోలీసులు కాంగ్రె్‌సకు వత్తాసు పలుకుతున్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ ఆరోపించారు. తమ పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి
భువనగిరి.. రణరంగం

రాజీనామాకే మొగ్గు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy