న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన కోవిడ్ సమీక్షా సమావేశాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ వేదికగా చేసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు శుక్రవారంనాడు ఆరోపించాయి. ఆయన ప్రసంగం పరిష్కారం సూచించే దిశగా లేదని, బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆ వర్గాలు పేర్కొన్నారు. కేంద్రం ఒక్క వ్యాక్సిన్ డోస్ కూడా ఉంచుకోకుండా రాష్ట్రాలకు పంచుతోందన్న విషయం తెలిసి కూడా వ్యాక్సిన్ ధరలపై అబద్ధాలు చెప్పే ప్రయత్నం ఆయన (కేజ్రీవాల్) చేసినట్టు ప్రభుత్వ వర్గాలు విమర్శించాయి. కేజ్రీవాల్ ఎయిర్ లిఫ్టింగ్ ఆక్సిజన్ ప్రస్తావన చేశారని, నిజానికి ఇప్పటికే ఎయిర్‌లిఫ్ట్ ద్వారా ఆక్సిజన్‌ను కేంద్రం సరఫరా చేస్తోందని వారు తెలిపారు.
'కేజ్రీవాల్ చాలా తక్కువ స్థాయికి జారిపోయారు. ముఖ్యమంత్రులతో ప్రధాని ప్రైవేటు సంభాషణను ఆయన బయటకు వెల్లడించారు. ఆయన ప్రసంగం మొత్తం ఏమాత్రం పరిష్కారం చూపించలేదు. రాజకీయాలు చేస్తూ, బాధ్యతను విస్మరించారు' అని ప్రభుత్వం వర్గాలు కేజ్రీవాల్ ప్రసంగంపై విమర్శలు గుప్పించాయి.
ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందనే విషయాన్ని కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ 'ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ లేకపోతే ఢిల్లీ ప్రజలకు ఆక్సిజన్ దొరకదా? దీనిపై కేంద్ర ప్రభుత్వంలో ఎవరితో మాట్లాడాలో దయచేసి సూచించండి' అని పేర్కొన్నారు. దేశంలో కోవిడ్ అసాధారణ పరిస్థితిపై ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

