ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చించారు. గత మంగళవారం అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఇరాన్ విషయమై చర్చించారు.
అయితే, ఈ కాల్‌లో టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ కూడా పాలుపంచుకున్నట్టు న్యూయార్క్ టైమ్స్‌లో తాజాగా ఒక కథనం ప్రచురితమైంది. ఇద్దరు దేశాధి నేతల మధ్య చర్చలో ఒక ప్రైవేటు వ్యక్తి పాలుపంచుకోవడం అసాధారణ విషయమని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది. కొందరు అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఈ కథనాన్ని ప్రచురించింది. ట్రంప్, మస్క్ మధ్య సయోధ్య కుదిరినట్టే అన్న విషయం ఈ పరిణామం రుజువు చేస్తోందని కూడా న్యూయార్క్ టైమ్స్ కామెంట్ చేసింది. అయితే, ఆ ఫోన్ కాల్‌లో మస్క్ ఎందుకు పాల్గొన్నారు? వారి మధ్య ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? అనే విషయాలు మాత్రం తెలియరాలేదు.
ఇక ప్రధాని మోదీతో ఫోన్ కాల్‌పై శ్వేత సౌధం స్పందిస్తూ ఇరు దేశాధి నేతల మధ్య నిర్మాణాత్మక చర్చ జరిగిందని పేర్కొంది. పశ్చిమాసియాలో ఘర్షణలపై ట్రంప్, మోదీలు తొలిసారిగా గత మంగళవారం చర్చించారు. ఈ సందర్భంగా హోర్ముజ్ జలసంధిని తెరిచే ఉంచాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ మార్గం మీదుగా ప్రయాణాలకు ఎలాంటి ఆటంకాలు ఉండరాదని చెప్పారు. ప్రపంచశాంతికి, స్థిరత్వానికి, ఆర్థికాభివృద్ధికి ఇది కీలకమని స్పష్టం చేశారు.
ఈ వార్తలూ చదవండి:

