తిరుపతి(కపిలతీర్థం), జూలై 30 (ఆంధ్రజ్యోతి): కడపజిల్లా ప్రొద్దుటూరు పరిధిలో గురువారం టాస్క్‌ఫోర్సు పోలీసులు తనిఖీలు నిర్వహించి ముగ్గు రు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు.
వారి వద్ద నుంచి ఏడు దుంగలు, బైక్, కారు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్సు హెడ్ సుబ్బరాయుడు ఆదేశాలతో ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్‌ఎ్‌సఐ వినోద్‌కుమార్ బృందం కడపజిల్లా బసాపురం వద్ద లోడింగ్ పాయింట్లలో తనిఖీ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున ఖాజీపేట సెక్షన్ పత్తూరు అటవీప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నాగపట్నంవైపు నుంచి బైక్, కారు వేగంగా వస్తూ కనిపించాయి. ఆ వాహనాలను ఆపగా, నడిపేవారు పరారయ్యే ప్రయత్నం చేశారు.
వారిని వెంబడించి ముగ్గురిని పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా ఏడు ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. పట్టుబడ్డ వారిని కడప, తిరుపతి జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. కారు, బైక్, ఎర్రచందనం దుంగలు, ముగ్గురు స్మగ్లర్లను తిరుపతి టాస్క్‌ఫోర్సు స్టేషన్‌కు తరలించి.. సీఐ ఖాదర్‌బాషా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

