Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబైతో మ్యాచ్‌కు ఫిట్‌గా లేను.. కానీ బరిలోకి దిగా: రియాన్ పరాగ్

ముంబైతో మ్యాచ్‌కు ఫిట్‌గా లేను.. కానీ బరిలోకి దిగా: రియాన్ పరాగ్

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

దీంతో ప్లే ఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. బ్యాటింగ్‌లో కాస్త తడబడింది. కానీ సమష్టి ప్రదర్శనతో 206 పరుగుల లక్ష్యాన్ని ముంబైకి నిర్దేశించింది. ఆర్ఆర్ బౌలర్లు విజృంభించడంతో.. జట్టుకు విజయం ఖాయమైంది. టాపార్డర్ మొత్తం విఫలమైన వేళ.. జోఫ్రా ఆర్చర్(32) జట్టును గాడీలో పెట్టాడు. ఆ తర్వాత జడేజా(19*) దూకుడుగా ఆడటంతో ఆర్ఆర్.. 200 స్కోర్ మార్క్‌ను అందుకోగలిగింది. అయితే రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ముంబైతో మ్యాచ్‌కు నేను ఫిట్‌గా లేను. ఈ మ్యాచ్‌తో పాటు మరో మ్యాచ్ కూడా ఆడొద్దని అనుకున్నాను. కానీ ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే సాహసం చేయాలని అనిపించింది. జట్టు అవసరం దృష్ట్యా ఆడాను. అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో కచ్చితంగా అందుబాటులో ఉంటాను. ఈ సీజన్‌లో ఒక కెప్టెన్‌గా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాను. నేను ఎప్పుడూ గణాంకాల కంటే పరిస్థితులను, నా అంచనాలను నమ్ముతాను. హార్దిక్ పాండ్యను ఔట్ చేయగలడని ఆర్చర్‌పైనే నమ్మకం పెట్టుకున్నా. అది ఫలించింది. టాపార్డర్ మొత్తం విఫలమైనప్పుడు.. భారీ షాట్లు ఆడగలడనే జోఫ్రా ఆర్చర్‌ను బ్యాటింగ్‌లో కాస్త ముందుకు పంపా. ఆ నిర్ణయం కూడా ఫలించింది. 15 బంతుల్లో 32 పరగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అటు బంతితోనూ చెలరేగి.. 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపు క్రెడిట్ మొత్తం ఆర్చర్‌కే చెందాలి. అయితే మేం ఇంకా కొన్ని విభాగాల్లో మెరుగుపడాల్సి ఉంది. టోర్నీ ఆరంభంలో అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ.. ఆ తర్వాత వరుస ఓటముల బారిన పడాల్సి వచ్చింది. ప్లే ఆఫ్స్‌కు చాలా ముందే అర్హత సాధించాల్సింది. కానీ కొన్ని మ్యాచ్‌లను మా చేతులారా వదులుకున్నాం' అని రియాన్ పరాగ్ వెల్లడించాడు.

బౌలర్‌గానే చూస్తారు: ఆర్చర్

బ్యాటు, బంతితో మెరిసిన జోఫ్రా ఆర్చర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఆ సందర్భంగా ఆర్చర్ మాట్లాడాడు. 'నన్ను నేను ఆల్‌రౌండర్‌గా భావిస్తాను. కానీ చాలామంది నన్ను కేవలం బౌలర్‌గానే చూస్తారు. జట్టుకు అవసరం అయినప్పుడు అన్ని విధాలుగా నా పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంటాను' అని తెలిపాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy