Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నా భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: ఎన్విడియా సీఈఓ

నా భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: ఎన్విడియా సీఈఓ

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియా(NVIDIA) సీఈఓ, కోఫౌండర్ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత వ్యవహారాలు, చైనా గూఢచర్య ఆరోపణలతో వార్తల్లో నిలిచారు.

ఈ నేపథ్యంలో తన భార్యకు నమ్మకద్రోహం చేశానని అంగీకరించిన ఆయన.. తమ సంస్థ ఉద్యోగులకు ఓ భావోద్వేగ లేఖ రాశారు.

'నా భార్యకు, కుటుంబానికి నేను క్షమాపణ చెప్పాలి. నేను చేసిన పని వల్ల.. ఆమెకు, పిల్లలకు బాధను మిగిల్చాను. నేను చేసిన తప్పునకు ఎలాంటి సమర్థనా లేదు. నా కుటుంబం నాపై చూపిన ప్రేమ, నమ్మకానికి తగినట్లు నేను నడుచుకోలేకపోయాను. నా తప్పులకు పూర్తి బాధ్యత నాదే' అని హువాంగ్ పేర్కొన్నారు. తన భార్య, కుటుంబ సభ్యుల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. అంతేకాకుండా ఎన్విడియా సంస్థ ఉద్యోగులు, బోర్డు డైరెక్టర్లు, భాగస్వాములు, వాటాదారుల విశ్వాసాన్ని కూడా మళ్లీ పొందాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన వాపోయారు. ఎన్విడియాకు నాయకత్వం వహించడమనేది ఓ గొప్ప అవకాశమని, సంస్థ పట్ల తన నిబద్ధతలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు.

చైనా గూఢచర్య కోణంలో దర్యాప్తు

మరోవైపు.. హువాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్న ఆలిస్ హువాంగ్ అనే చైనా మహిళ ద్వారా ఎన్విడియా అత్యాధునిక ఏఐ చిప్‌లకు సంబంధించిన సమాచారం, కీలక వివరాలను బీజింగ్‌కు చేరుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపాయి. సింగపుర్‌కు చెందిన డేటా సెంటర్ సంస్థ మెగాస్పీడ్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న ఆమె.. చైనా నిఘా వ్యవస్థకు సహకరిస్తున్నారని అమెరికా నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు.. హువాంగ్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. జాతీయ భద్రతకు సంబంధించిన ఆరోపణలపై జరుగుతున్న విచారణకు పూర్తిగా సహకరిస్తానని లేఖలో వెల్లడించారు హువాంగ్. అమెరికా జాతీయ భద్రతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఈ విషయమై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందిస్తూ.. ఇది అంతర్గత కార్పొరేట్ వ్యవహారమని, దీనిపై తానేం మాట్లాడనేనన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy