Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాకేమీ తెలియదు.. గుర్తులేదు!

నాకేమీ తెలియదు.. గుర్తులేదు!

  • పోలీసు కస్టడీ విచారణలో అప్పలరాజు బుకాయింపు

  • సమాధానాలు చెప్పకుండా దాటవేత ధోరణి

  • విచారణ అనంతరం మళ్లీ జైలుకు తరలింపు

  • కోర్టు ఆవరణలో వైసీపీ కార్యకర్తల వీరంగం

  • 'సుప్రీంకోర్టుకు వెళ్లి మీ సంగతి తేలుస్తాం' అంటూ పోలీసులకు బెదిరింపులు

శ్రీకాకుళం/పలాస, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఒకరోజు పోలీసు కస్టడీ విచారణ మంగళవారం ఉత్కంఠభరితంగా ముగిసింది. కాశీబుగ్గ స్టేషన్‌లో జరిగిన విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు అప్పలరాజు సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు తెలిసింది. సోంపేట సీఐ మంగరాజు ఉదయం 11.50 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ అప్పలరాజును విచారించారు. 'ఈ నెల 10వ తేదీ రాత్రి రోడ్డుపై ప్రాణాపాయస్థితిలో ఉన్న గొర్రెల కాపరి దుబ్బ దానయ్యను ఎందుకు పట్టించుకోలేదు? గాయపడిన మీ కుమారుడ్ని మాత్రం ఆస్పత్రికి తరలించి నిజాలు ఎందుకు దాచారు? ప్రమాదానికి కారకుడైన మీ కుమారుడిని తప్పించి.. అతని బదులు సిద్ధార్థ అనే వ్యక్తిని ఎందుకు తెరపైకి తెచ్చారు? పోలీసులను ఎందుకు తప్పుదోవ పట్టించారు?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే సీదిరి అప్పలరాజు ఏ ఒక్క ప్రశ్నకూ సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. చాలా ప్రశ్నలకు 'నాకు తెలియదు.. నాకేమీ గుర్తులేదు' అని బుకాయించగా.. మరికొన్నింటికి పొంతనలేని సమాధానాలు ఇచ్చి విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మంగళవారం ఉదయం అంపోలు జిల్లా జైలు నుంచి భారీ భద్రత నడుమ అప్పలరాజును కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కస్టడీ విచారణ చేపట్టారు.

26 గంటల నిర్బంధం.. తిప్పికొట్టిన పోలీసులు

విచారణ పూర్తి తర్వాత సాయంత్రం 4.30 గంటలకు అప్పలరాజును పలాస ప్రభుత్వాసుత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పలాస కోర్టులో మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా అప్పలరాజు తరపు న్యాయవాది పోలీసులపై సంచలన ఆరోపణ చేశారు. 'అప్పలరాజును అరెస్టు చేసిన సమయంలో 26 గంటల పాటు స్టేషన్‌లోనే అక్రమంగా ఉంచారు' అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన న్యాయాధికారి పోలీసులను ప్రశ్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అరెస్టుకు సంబంధించిన సమయాలను, ఆధారాలను చూపేందుకు కాస్త సమయం కావాలని కోరారు. అనుమతి లభించిన వెంటనే.. అరెస్టు ప్రక్రియకు సంబంధించిన పక్కా ఆధారాలను న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టి ఆ ఆరోపణలను తిప్పికొట్టారు. అనంతరం పోలీసులు అప్పలరాజును మళ్లీ జైలుకు తరలించారు.

నేడు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

అప్పలరాజు బెయిల్‌ పిటిషన్‌పై బుధవారం సోంపేట కోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌ మంగళవారమే విచారణకు రాగా.. పోలీసు కస్టడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు తర్వాతి రోజుకు వాయిదా వేసింది. ఈ విచారణ వర్చువల్‌ విధానం ద్వారా కూడా జరిగే అవకాశం ఉందని సీదిరి తరఫు న్యాయవాదులు బాలకృష్ణ, కొమర దేవరాజు పేర్కొన్నారు.

న్యాయవాదులమంటూ వైసీపీ కార్యకర్తల వీరంగం

కాగా, కోర్టు ఆవరణలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు వైసీపీ కార్యకర్తలు తాము న్యాయవాదులమంటూ కోర్టు ప్రాంగణంలోకి చొరబడి, హైడ్రామా చేశారు. అందులో ఒకరు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఏకంగా 'సుప్రీంకోర్టుకు వెళ్లి మీ సంగతి తేలుస్తాం' అంటూ పోలీసులను తీవ్రస్థాయిలో హెచ్చరించడం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. ఇక మరో కార్యకర్త కోర్టులో జరుగుతున్న పరిణామాలను, వాదనలను ఎప్పటికప్పుడు ఫోన్‌ ద్వారా తమ నాయకుడికి చేరవేస్తూ కనిపించాడు. అప్పలరాజు తరఫు న్యాయవాది బాలకృష్ణ కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ.. తన క్లయింట్‌ పట్ల పోలీసులు బాగానే వ్యవహరించారని, అయితే విచారణలో మళ్లీ పాత ప్రశ్నలే అడిగారని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy