విశాఖపట్నం/అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల రాకపై భారత వాతావరణ శాఖ శనివారం కీలక ప్రకటన చేసింది. వచ్చే నాలుగైదు రోజుల్లో కేరళతోపాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.
ప్రస్తుతం కేరళ, పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో రెండు మూడు రోజుల్లో గాలుల దిశ మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదిలావుండగా అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. భూమధ్య రేఖ దాటి హిందూ మహా సముద్రంలోకి రుతుపవన మేఘాల రాక మొదలైంది. శనివారం నాటి వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ఐఎండీ, నాలుగైదు రోజుల్లో కేరళ, తమిళనాడుకు రుతుపవనాలు రానున్నాయని వెల్లడించింది. జూన్ మూడు లేదా నాలుగో తేదీన కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పలువురు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నేడు చెదురుమదురు వర్షాలు
రాష్ట్రంలో శనివారం ఎండ తీవ్రత, వడగాడ్పుల ప్రభావం బాగా తగ్గింది. అక్కడక్కడా ఓ మోస్తరుగా వర్షాలు పడ్డాయి. నంద్యాల జిల్లా సంజామలలో 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆదివారం అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 42-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

