Saturday, 23 Jun, 3.06 am ఆంధ్రజ్యోతి

ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు
నారంశెట్టి, మౌళిలకు అకాడమీ పురస్కారాలు

  • 'ఆనంద లోకం' నవలకు గాను నారంశెట్టికి బాలల అవార్డు
  • 'ఆకు కదలని చోట' కవిత్వానికి బాలసుధాకర్‌కి యువ అవార్డు

న్యూఢిల్లీ, పార్వతీపురం టౌన్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సాహిత్య అకాడమీ 2018 సంవత్సరానికి గాను బాల, యువ సాహిత్య అవార్డులను ప్రకటించింది. బాల సాహిత్యంలో 23 మంది, యువ సాహిత్యంలో 21 మంది ఎంపికైనట్లు అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు. యువ పురస్కారానికి 'ఆకు కదలని చోట' కవిత్వ సంపుటికిగాను బాల సుధాకర్‌ మౌళి ఎంపికయ్యారు. బాలల సాహిత్య పురస్కారానికి నారంశెట్టి ఉమామహేశ్వర రావు పేరును ప్రకటించారు. ఆయన నవల 'ఆనందలోకం'కు ఈ గౌరవం దక్కింది. ఈ అవార్డుల కింద జ్ఞాపిక, రూ. 50వేల నగదును అందిస్తారు.

40 ఏళ్లుగా బాలల సాహిత్య సేవ

విజయనగరం జిల్లా పార్వతిపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నారంశెట్టి ఉమామహేశ్వరరావు 40 ఏళ్లకు పైగా బాలసాహిత్యంలో విశేష సేవలందిస్తున్నారు. ఆయన విజయనగరం జిల్లా సీతానగరం మండలం గెడ్డలుప్పి గ్రామంలో గంగయ్య, సావిత్రమ్మ దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. చిన్నప్పటినుంచే సాహిత్యంతో ఆయనకు అనుబంధం ఉంది. తొమ్మిదో తరగతిలో ఉండగా, ఆయన రాసిన 'మేలెరిగిన మనిషి' నవల 1981లో బాలజ్యోతిలో అచ్చయింది. 'తానా' నిర్వహించిన నవల పోటీల్లో ఆయనకు మొదటి బహుమతి లభించింది. బాలల సాహిత్యానికి ఆయన అందిస్తున్న సేవలకు మెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు 2016లో మాతృభాషా సేవా పురస్కారంతో ఉమామహేశ్వరరావును సత్కరించారు.

కవిత్వంలో నవ్యగొంతుక

విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరాంలో బాలసుధాకర్‌ మౌళి జన్మించారు. ఈ జిల్లాలోని గర్భాం జిల్లా పరిషత్‌ హైస్కూలులో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. ఉత్తరాంధ్ర కవిత్వంలో నవ్య గొంతుకగా మౌళి నిలిచారు. 2014లో ఆయన ప్రచురించిన 'ఎగరాల్సిన సమయం' కవితా సంపుటి సాహితీవిమర్శకుల ప్రశంసలను అందుకొంది. అనేక అవార్డులను పొందింది. ఆ తరువాత రెండేళ్లకు 'ఆకు కదలని చోట' సంపుటిని మౌళి వెలువరించారు. తన తరగతి గదిలోని విద్యార్థుల కవిత్వంతో 2017లో 'స్వప్న సాధకులు' అనే సంకలనం ప్రచురించారు. పదేళ్లుగా కవిత్వంలో తన ముద్ర కోసం ప్రయత్నిస్తున్న మౌళి అనేక అవార్డులను అందుకొన్నారు. 2016లో ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌, 2015లో భారతీయ భాషా పరిషత్‌ పురస్కారం, కలేకూరి స్మారక కవితా పురస్కారం, విశాలశాంతి సాహితీ పురస్కారం, 2014లో ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు, యువసాహితీ పురస్కారం అందుకొన్నారు.

భాషనీ తల్లిలాగే చూడాలి

''నా నవల 'ఆనంద లోకం' కేంద్ర సాహిత్య పురస్కారానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. మన తల్లికి ఇచ్చే గౌరవాన్ని, భాషాకూ ఇవ్వాలని ఆకాంక్షిస్తాను. తెలుగు సాహిత్యానికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలి. బడిపిల్లల్లో కథ రచనలపై ఆసక్తి పెంచే విధంగా సృజనాత్మక కార్యశాలలు ఏర్పాటు చేసి శిక్షణనివ్వాలి. ఒకటి నుంచి 10వ తరగతి వరకూ తెలుగును తప్పనిసరి చేయాలి''

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు

శ్రమజీవులే నా కవితా వస్తువు

''కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన సాహిత్యకారుల్లో ఉత్తరాంధ్ర నుంచి కాళీపట్నం రామారావు, శ్రీశ్రీ తదితర ప్రముఖులు ఉన్నారు. అలాంటి ప్రతిష్ఠాత్మక అకాడమీ నుంచి యువ పురస్కారం లభించడం సంతోషంగా ఉంది. భారతదేశ సమాజ స్థితిగతులను అక్షరబద్ధం చేయడానికి 'ఆకు కదలని చోట' కవితా సంపుటిలో ప్రయత్నించాను. శ్రామిక ప్రజల జీవితాలను, పోరాటాలను కవితా వస్తువుగా చేసుకొన్నాను. తరగతి గదిని ఈ దేశానికి ప్రతీకగా మలిచేందుకు ఈ సంపుటిలో ప్రయత్నించాను''

- బాలసుధాకర్‌ మౌళి

Dailyhunt
Top