Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నక్సల్‌ ముక్త్‌ భారత్‌కు కొత్త సవాళ్లు!

నక్సల్‌ ముక్త్‌ భారత్‌కు కొత్త సవాళ్లు!

వామపక్ష తీవ్రవాదం నుంచి భారత్‌ను విముక్తం చేసే లక్ష్యాన్ని సాధించినట్టు ఈ ఏడాది మార్చి మాసాంతంలో భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ లక్ష్య పరిపూర్తి అంతర్గత భద్రతా రంగంలో ఒక కీలక విజయం.

అయితే భౌతిక ఆవరణంలో నక్సలిజం బలహీనపడుతున్నప్పటికీ, దానికి మద్దతుగా పనిచేసే ఒక అంతర్జాతీయ భావజాల నెట్‌వర్క్ ఇంకా చురుకుగా కొనసాగుతూ, కొత్త కథనాల నిర్మాణంతో నక్సలైట్‌ ఉద్యమాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

యూరప్, ఉత్తర అమెరికా, ఆసియాలోని కొన్ని దేశాలలో ఉన్న సంస్థలు, ప్రచురణలు, కార్యకర్తల సమూహాలు, సిద్ధాంత వేదికలు కలిసి ఒక సమన్వయ వ్యవస్థగా పనిచేస్తున్నాయి. ఇవి ఆదివాసీలు, కార్మికులు, అట్టడుగువర్గాలపై అణచివేతకు పాల్పడే రాజ్యంగా భారతదేశాన్ని చిత్రీకరించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాయి. ఆ సంస్థలు, వేదికలు సృష్టిస్తున్న, వెలువరిస్తున్న కథనాలు రాజ్య వ్యవస్థను దోపిడీ యంత్రాంగంగా చూపిస్తూ, సాయుధ పోరాటాన్ని సమర్థించే మావోయిస్టు సిద్ధాంతంతో ముడిపడి ఉన్నాయి.

ఆస్ట్రేలియాలోని రెడ్-స్పార్క్, అమెరికాలోని బ్యాన్డ్ థాట్ వంటి కొన్ని అంతర్జాతీయ వేదికలు మావోయిస్టు భావజాలాన్ని బహిరంగంగా ప్రచారం చేస్తున్నాయి. సాయుధ పంథాను సమర్థించే సైద్ధాంతిక పత్రాలతో సహా సీపీఐ (మావోయిస్టు) భావజాలానికి అనుకూలంగా ఉన్న వ్యాసాలు, పుస్తకాలను పునః ప్రచురిస్తున్నాయి. అలాగే, సాయుధ పోరాటాన్ని సమర్థిస్తున్న 'ఇంటర్నేషనల్ కమిటీ టు సపోర్ట్ ది పీపుల్స్ వార్ ఇన్ ఇండియా' నెట్‌వర్క్‌లు అంతర్గత భద్రతకు భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తీవ్రంగా విమర్శిస్తూ, సాయుధ ఉద్యమానికి నైతిక మద్దతు సమీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. తీవ్రవాద వ్యతిరేక చర్యలలో భాగంగా భారత ప్రభుత్వం సామూహిక హత్యాకాండకు పాల్పడుతున్నదని అవి ఆరోపిస్తున్నాయి. డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్ ప్రచురణలు ఈ కథనాల వ్యాప్తికి సాధనాలు. భౌతికంగా బలహీనపడిన ఉద్యమాలను భావజాల స్థాయిలో నిలబెట్టేందుకు ఈ వేదికలు ఉపయోగపడుతున్నాయి.

జర్మనీకి చెందిన DemVolkeDienen, అమెరికా/ ఫ్రాన్స్‌కు చెందిన The Red Herald వంటి భావజాల వేదికలు భారత ప్రభుత్వ అంతర్గత భద్రతా చర్యలను ఒక క్రమ పద్ధతిలో సామ్రాజ్యవాద వ్యతిరేక దృక్కోణంతో పునర్వ్యాఖ్యానిస్తున్నాయి. రెండో స్థాయి కార్మిక, హక్కుల పరిరక్షణ వేదికల ద్వారా ఆ కథనాలకు విశేష ప్రచారం లభిస్తోంది. ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కన్ఫడరేషన్‌ (ఐటీయూసీ), వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (డబ్ల్యుఎఫ్‌టీయూ) వంటి అంతర్జాతీయ కార్మిక సంస్థలు భారత కార్మిక సమస్యలపై తరచూ స్పందిస్తుంటాయి. అయితే, భారతదేశంలో వ్యవస్థాగత దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతున్నదనే అభిప్రాయాన్ని అంతర్జాతీయ సమాజంలో కలిగించడమే ఈ నివేదికల లక్ష్యంగా ఉంటోంది. బెల్జియంకు చెందిన Via Campesina వంటి సంస్థలు కొన్నిసార్లు దేశీయ నిరసనలను విస్తృత ప్రభుత్వ వ్యతిరేక కథనాలతో అనుసంధానిస్తున్నాయి.

నక్సల్స్‌ అనుకూల అంతర్జాతీయ కథనాల సృష్టిలో విద్యావేత్తల, మేధావి వర్గాల ప్రమేయం ప్రముఖంగా ఉంటోంది. బ్రిటన్‌కు చెందిన అల్పా షా, జర్మనీకి చెందిన కాళికా మెహతా తదితర వ్యాఖ్యాతలు భీమా కోరేగావ్ కేసుల వ్యవహారాలను ప్రస్తావిస్తూ వ్యవస్థాగత అణచివేతపై పలు వాదనలను ముందుకు తెచ్చారు. అటువంటి ఘటనలను ఎంపిక చేసుకుని వాటిని ఒకే దృక్కోణంతో విశ్లేషించడం, వివరించడం మేధా నిష్పాక్షికతను తెలియజేస్తుందా? పైగా ఆ పాక్షిక విపులీకరణలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడం ద్వారా తిరుగుబాటుదారుల లక్ష్యాలకు అనుగుణమైన చిత్రణకే దోహదం చేస్తోంది. మరీ ముఖ్యంగా, 'ఆపరేషన్ కగార్' పై వ్యతిరేకత ఈ వ్యవస్థలో తరచూ కనిపించే అంశం. బ్రిటన్‌లోని విద్యార్థి సంఘాల నుంచి ఫిలిప్పీన్స్, ఆస్ట్రియాలోని కార్యకర్తల బృందాల వరకు అనేక సంస్థలు ఈ కగార్‌ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాయి. ఇది అంతర్గత భద్రతపై భారత ప్రభుత్వ నిర్ణయాలను అంతర్జాతీయీకరించి రాజకీయ అంశంగా మార్చే ప్రయత్నాలను సూచిస్తుంది.

భౌగోళికంగా కూడా ఈ కథనాల వ్యాప్తి విస్తృతంగా ఉన్నది. ఫ్రాన్స్, జర్మనీ నుంచి టర్కీ, బ్రిటన్‌, అమెరికా దాకా ఈ విధమైన ప్రచార, మద్దతు నెట్‌వర్క్‌లు విస్తరించి ఉన్నాయి. సామ్రాజ్యవాద వ్యతిరేకత, మావోయిస్టు సంఘీభావం పేరిట కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ టర్కీ (మార్క్సిస్ట్‌- లెనినిస్ట్‌) రెవల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా మొదలైన విదేశీ రాజకీయ పార్టీలు భారత్‌ వ్యతిరేక కథనాలకు మద్దతునిస్తున్నాయి. భారత్‌లో మావోయిస్టు సాయుధ పోరాట కార్యకలాపాలకు వాటిల్లిన తీరని నష్టానికి పరిహారంగా ఆ తీవ్రవాద ఉద్యమానికి అంతర్జాతీయంగా సైద్ధాంతిక న్యాయబద్ధత కల్పించడమే ఆ కథనాల వ్యూహాత్మక లక్ష్యం. అభివృద్ధి కార్యకలాపాలను 'కార్పొరేట్‌ దోపిడీ'గాను, అంతర్గత భద్రతా చర్యలను 'రాజ్యహింస'గాను అవి చిత్రిస్తున్నాయి. దేశీయ వామపక్ష సంఘాలు, విదేశాలలోని భారతీయులతో ముడివడివున్న నెట్‌వర్క్‌లు వామపక్ష తీవ్రవాదానికి అనుకూలంగా పునః క్రియాశీలం చేయడమే వాటి సంకల్పం. ఈ వాస్తవాల దృష్ట్యా ఆ కథనాలకు భారత్‌ ప్రతిస్పందన సంప్రదాయ భద్రతా చట్రాలను దాటి విస్తరించాలి. ఇప్పటికీ లొంగిపోని తీవ్రవాదుల కదలికలపై నిరంతర నిఘా నిర్వహిస్తూ అంతర్జాతీయంగా వ్యాప్తిలో ఉన్న తప్పుడు కథనాలకు వ్యతిరేకంగా సమాచార సమరాన్ని ముమ్మరం చేయాలి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి కార్యకలాపాలు సాధిస్తున్న సత్ఫలితాలను అంతర్జాతీయ చర్చా వేదికలపై నివేదించాలి.

ప్రజాక్షేత్ర స్థాయిలో మావోయిస్టు హింసాత్మక కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడం ఒక గణనీయమైన విజయం, సందేహం లేదు. అయితే మావోయిస్టుల పోరు వనాల నుంచి వేదికలకు- సాయుధ పోరాటం నుంచి సమాచార సమరానికి మారింది. ఈ వాస్తవాన్ని గుర్తించి నక్సల్‌ ముక్త్‌ భారత్‌ పూర్వస్థితికి తిరోగమించకుండా సుస్థిరంగా ఉండేందుకు ప్రభుత్వమూ, ప్రజలూ దృఢ సంకల్పం వహించాలి.

డాక్టర్‌ కంచన్‌ లక్ష్మణ్‌

జాతీయ భద్రతా విశ్లేషకులు

టీఎంసీలో చిచ్చు... రెబల్ ఎమ్మెల్యేలతో 23 మంది ఎంపీల మంతనాలు

కాంగ్రెస్‌కు జేఎంఎం ఝలక్.. రెండు రాజ్యసభ సీట్లలో పోటీకి కసరత్తు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy