Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేనుండగా కాంగ్రెస్‌ను ఎవరూ కబ్జా చేయలేరు

నేనుండగా కాంగ్రెస్‌ను ఎవరూ కబ్జా చేయలేరు

  • మా ఇంటికే వచ్చి మమ్మల్నే గెంటేస్తామంటే ఊరుకోం

  • రాష్ట్రంలో మళ్లీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి యుగం వస్తుంది

  • అడ్డంకులు ఎదురైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా

  • సీఎం అయ్యే సమయం వస్తే బ్రహ్మదేవుడూ ఆపలేడు

  • నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు

నల్లగొండ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్‌ బలోపేతానికి ఇతర పార్టీల నాయకులను ఆహ్వానించామని, కానీ తమ ఇంటికే వచ్చి తమనే గెంటేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. తనలో అణువణువు కాంగ్రెస్‌ రక్తమే ఉందని, తాను ఉన్నంత వరకూ కాంగ్రెస్‌ను ఎవరూ కబ్జా చేయలేరని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిఖార్సైన నాయకుడిగా ఉంటూనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని, నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరగొద్దని కోరే సందర్భంలోనే తాను తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నానని పేర్కొన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలలో బుధవారం వైఎ్‌సఆర్‌ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర పాలకుల చెప్పుచేతుల్లోనే ప్రభుత్వం నడవకూడదని, కొందరు మీడియా సంస్థల అధిపతులు చెబితే ప్రభుత్వం పని చేయకూడదనేదే తన ఆలోచన అన్నారు. నిజాయితీగా పాలించి ప్రజలకు న్యాయం చేయాలని తాను కోరుకుంటున్నానన్నారు.

కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరేలా ఉన్నాయని, ఆ విషయంలోనే తాను అప్పుడప్పుడు సీరియస్‌ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందే తప్ప వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదన్నారు. రాహుల్‌గాంధీ, మీనాక్షి నటరాజన్‌ను కలిసి ఈ విషయాలు చెప్పానని, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌తోనూ ఎప్పటికప్పుడు చర్చిస్తున్నానని పేర్కొన్నారు. తాను చెబుతున్న విషయాలను అధిష్ఠానం పరిశీలించి కష్టాలు పడే కార్యకర్తలను కాపాడుతుందనే నమ్మకం ఉందని అన్నారు. రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి యుగం మళ్లీ వస్తుందని రాజగోపాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్‌ లాంటి నేత మరొకరు లేరని, తాము రాజశేఖరరెడ్డి శిష్యులమని కోమటిరెడ్డి సోదరులం గర్వంగా చెప్పుకుంటామన్నారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు సీఎం.. సీఎం అని నినాదాలు చేస్తుండగా.. ఆ టైమ్‌ వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం కొంతమంది ఎలక్ర్టానిక్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డి.. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీపై తన ఆక్రోశం వెళ్లగక్కారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy